స్వతంత్రులతోటి..!
పోటాపోటీ..
జగిత్యాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. జిల్లాలో ప్రధానంగా పెద్ద మున్సిపాలిటీలైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఉండగా.. జగిత్యాలలో స్వతంత్రులదే హవా నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రులు బరిలో ఉన్న వార్డుల్లో పోటీ ఆసక్తిగా మారింది. స్వతంత్రులతోనే ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా జగిత్యాలలో అటు జీవన్‌రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ తరఫున 15 మంది, 35 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. అటు సంజయ్ వర్గీయులు 35 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా.. 15 మంది స్వతంత్రులుగా ఉన్నారు. వీరి మధ్యనే అత్యధికంగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల బీఆర్‌ఎస ప్రభావం చూపే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల బీజేపీ వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయి.
స్వతంత్ర అభ్యర్థుల సవాల్
జగిత్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులే కీలకం అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. చైర్మన్ ఎన్నికలో వీరు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవన్‌రెడ్డి వర్గీయులు 35 మంది కాంగ్రెస్ టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలో ఉండటంతోపాటు వారికి జీవన్‌రెడ్డి మద్దతు ఇస్తున్నారు. స్వతంత్రులను గెలిపించాలని వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో 35 మంది గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు వ్యక్తిగత చరిష్మా, సామాజిక వర్గం, ఆర్థిక బలం, గతంలో పోటీచేసిన అనుభవం ఉండటంతో వీరు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిచోట్ల సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు సైతం అత్యధికంగా ఉండటంతో గంపగుత్తగా పడే అవకాశాలున్నాయి. తమకు కేటాయించిన గుర్తులను చూపిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ స్వతంత్రులు గెలువకున్నా వారు మాత్రం ప్రధాన పార్టీల గెలిచే అభ్యర్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ రెబల్ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరుగుతోంది. కొన్ని సీట్లలో అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీ పంచుకునే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి బోగ శ్రావణి, బీఆర్‌ఎస్ నుంచి ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్‌లో రెబల్స్‌కు జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులకు సంజయ్‌కుమార్ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో మంత్రులు లక్ష్మణ్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. జగిత్యాలలో మాత్రం ప్రధాన నాయకులు మాత్రం ఇప్పటివరకు ఎవరూ ప్రచారం నిర్వహించలేదు.
గెలుపే లక్ష్యంగా ప్రణాళిక
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. మహిళ సంఘాలు, కుటుంబ సభ్యులు, యువజన సంఘాలు, ఇతర సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ప్రణాళికప్రకారం ముందుకెళ్తున్నారు. సంఘాలకు హామీలివ్వడంతో పాటు, ప్రతి పని చేసిపెడతామని పేర్కొంటున్నారు. మహిళాసంఘాలు గెలుపు ఓటముల ప్రభావం వీరిపైనే ఉండటంతో వారి అవసరాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదు మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహిళ ఓటర్లే ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా వస్తే గెలుపు ఒకేవైపు ఉంటుందని మహిళాసంఘాలకు కొంతమేర అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అభ్యర్థులు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు.
ఎక్కడికక్కడ పోటీ ఇస్తున్న అభ్యర్థులు
ప్రధాన పార్టీల్లో ఓట్ల చీలిక భయం
గెలుపోటములపై తీవ్ర ప్రభావం
ఊపందుకున్న అన్ని పార్టీల ప్రచారం
ప్రలోభాలు
ప్రచారపర్వానికి రెండు రోజులు మాత్రమే ఉండటంతో మున్సిపాలిటీల్లో నాయకులు కార్నర్ మీటింగ్‌లు, సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పగలంతా ఇంటింటి ప్రచారం చేపట్టడం, సాయంత్రం వేళల్లో గల్లీల వద్ద కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కొన్నిచోట్ల ఇప్పటి నుంచే ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పట్టుచీరలు, కుంకుమ భరణిలు, కొందరు వారి గుర్తులకు సంబంధించిన వస్తువులు, మరికొందరు మద్యం, మాంసం అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు. మొత్తానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని గల్లీల వద్ద విందులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. మద్యం పంపిణీతో పాటు, కొన్ని చోట్ల చికెన్, మటన్ పంపిణీ చేస్తున్నారు.
స్వతంత్రులతోటి..!


