వలస కాంగ్రెస్ నాయకులను బొంద పెడదాం
రాయికల్: మున్సిపల్ ఎన్నికల్లో వలస కాంగ్రెస్ నాయకులను ఓటుతో బొందపెట్టాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. బల్దియాలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా శనివారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ జెండా మోయని వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. చేతిగుర్తును దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. అభివృద్ధి పేరిట ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు స్పీకర్ ప్రకటించినా.. కాంగ్రెస్ కార్యకర్తలను కాదని ఏనాడూ జెండా మోయని వారికి టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. జగిత్యాలలో తైబజార్ ఎత్తివేసినట్లు రాయికల్‌లో కూడా ఎత్తివేస్తామని తెలిపారు. తమది ఒరిజినల్ కాంగ్రెస్ అని గుర్తుచేశారు.
బాధ్యతగల పౌరుడిగా పోరాడుతా..
జగిత్యాలటౌన్: తనకు పదవి లేకున్నా.. ప్రజల తరఫున పోరాటం చేస్తానని జీవన్‌రెడ్డి అన్నారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న కాలుష్యం, పొగతో ఇబ్బంది పడుతున్నామంటూ నూకపెల్లి డబుల్‌బెడ్‌రూం కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం డంపింగ్ యార్డును సందర్శించారు. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా దుర్గంధం వెదజల్లుతోందన్నారు. చెత్తను గుట్ట సమీపంలో వేసి బయోమైనింగ్ నిర్వహించి పొల్యూషన్ లేకుండా చూడాలని కోరారు.


