అధ్వానంగా ఎస్సారెస్పీ కాలువలు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లాకు సాగునీరు అందించే కాకతీయ కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు గుట్టలు, వాగుల నుంచి వరద నీరు వచ్చి కాలువల్లో ఇసుక మేటలు వేశాయి. దీనికి తోడు కాలువకు ఇరువైపులా ఉన్న ఎత్తైన చెట్లు ఈదురుగాలులకు కాలువల్లో పడ్డాయి. ఫలితంగా ఎస్సారెస్పీ నుంచి సాగునీరు వస్తున్నా.. పంట పొలాలకు వెళ్లడం గగనంగా మారింది.
జిల్లాలో 91 కిలోమీటర్ల మేర కాలువ
కాకతీయ ప్రధాన కాలువ ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు 91కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఎస్సారెస్పీ నుంచి వచ్చే నీరు 25కిలోమీటర్ వద్ద జిల్లాలో ప్రవేశించి.. 116 కిలోమీటర్ వద్ద ముగుస్తుంది. కాకతీయ కాలువకు డీ–21 నుంచి డీ–83ఏ వరకు 62 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీ ఆయకట్టు ఏరియాను బట్టి కాలువకు ఎడమవైపు 25, కుడివైపు మరో 25 మైనర్ కాలువలున్నాయి. ఈ మైనర్ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు చేరుతుంది. ఇలా జిల్లాలో 1.68 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పరోక్షంగా మరో లక్ష ఎకరాల వరకు సాగవుతుంది.
ఎక్కడికక్కడే ధ్వంసం
కాలువలు ఎక్కడికక్కడే ధ్వంసం కావడంతో చివరి మండలాలైన వెల్గటూర్, పెగడపల్లి, ధర్మపురి వరకు సాగునీరు చేరడం కష్టంగా మారింది. 2008లో అప్పటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులతో డిస్ట్రిబ్యూటరీ కాలువకు మరమ్మతు చేయించినప్పటికీ తర్వాత అతీగతి లేకుండా పోయింది. మైనర్ కాలువలకు సాగునీరు వచ్చే మార్గం లేకపోవడంతో రైతులు డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో రాళ్లు అడ్డుగా వేసి నీళ్లు తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. అవసరమైతే కాలువలకు గండ్లు పెడుతున్నారు. అలాగే చాలా మైనర్ కాలువలకు నీరు వచ్చే అవకాశం లేక రైతులు ఎక్కడికక్కడే దున్ని తమ భూముల్లో కలుపుకొన్నారు. రాయికల్ మండలంలోని జగన్నాథపూర్, జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌పల్లి, బుగ్గారం మండల సిరికొండ, పెగడపల్లి మండలం వెంగళాయిపేట, లింగాపూర్, దోమలకుంట, ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ 53 రోళ్లవాగు కింద ఉన్న ధర్మపురి మండలం చివరి గ్రామాలకు సాగునీరు అందడం కష్టంగా మారింది.
అధికారుల పర్యవేక్షణ శూన్యం
ఒకప్పుడు మైనర్ కాలువ నుంచి ఎస్సారెస్పీ వరకు నీటి సంఘాల పాలకవర్గం, చైర్మన్లు ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో కాలువల పరిస్థితి ఘోరంగా తయారైంది. దీనికితోడు కాలువ నీటిని సక్రమంగా పంపిణీ చేసేందుకు అధికారులు, లస్కర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. ఇప్పుడు సిబ్బంది కొరతతో అధికారులు కాలువల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోయింది.
తిమ్మాపూర్ వద్ద కొట్టుకుపోయిన కెనాల్ సిమెంట్ లైనింగ్
మోతె వద్ద డీ–63 కెనాల్‌లో కూలిన డ్రాప్‌లు
చివరికి చేరని నీరు
ఊడిపోతున్న లైనింగ్‌లు
పగిలిపోతున్న డ్రాప్‌లు
అధ్వానంగా ఎస్సారెస్పీ కాలువలు


