సందడే సందడి..!
జగిత్యాల: రిజర్వేషన్ల ఖరారుతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్నట్లు సంకేతాలు వెలువడడంతో ఆశావహులు అంచనాల్లో మునిగిపోయారు. ఇప్పటికే ఓటర్ల జాబితా విడుదల కావడం.. చైర్మన్‌తోపాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించడంతో పుర ప్రజల చూపు ఇక ఎన్నికల నోటిఫికేషన్ వైపు పడింది. రిజర్వేషన్లు అనుకూలించిన వారు.. ఇప్పటికే కౌన్సిలర్‌గా పోటీ చేద్దామనుకున్న వారు వార్డుల్లో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ సారి మహిళలకు 50శాతం పైగా రిజర్వేషన్ ప్రకటించడంతో పలుకుబడి ఉన్నవారు తమతమ సతీమణులను పోరులో నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నాయకులు టికెట్ల కోసం ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ.. తమకున్న గెలుపు అవకాశాలను వారికి వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు గెలుపుగుర్రాలపై సర్వే చేయించాయి. రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడటంతో నోటిఫికేషన్ రాగానే పోటీలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. చైర్మన్ పీఠంపై కన్నేసిన నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ స్థానం గత ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. ఈ సారి కూడా బీసీ మహిళకే కేటాయించారు. రాయికల్, మెట్‌పల్లి జనరల్ కాగా.. ధర్మపురి, కోరుట్ల జనరల్ మహిళకు కేటాయించారు.
ఎన్నికలకు ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అవుతుందన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వస్తే అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారు.
ఊపందుకోనున్న ప్రచారం
రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక ప్రచారం ఊపందుకోనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే ఆశావహులు కౌన్సిలర్ పదవి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ రానున్న ఎన్నికల్లో తమకే ఓటు వేయాలంటూ ముందుకెళ్తున్నారు. ఒకవైపు ప్రధాన పార్టీల టికెట్లను ఆశిస్తూ.. లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన నాయకులు ఈసారి పదవి దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ జగిత్యాల. ఇక్కడ గతంలో 48 వార్డులు ఉండగా.. డీలిమిటేషన్‌తో రెండు వార్డులు పెరిగి 50కి చేరాయి. కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌లో అవే వార్డులున్నాయి. ఒక్కో వార్డులో 1800 చొప్పున ఓటర్లను చేర్చారు.
పార్టీలు సంసిద్ధం
మున్సిపాలిటీల చైర్మన్ సీట్లు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ప్రధానపార్టీలు సిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపాలిటీలో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఈసారి కూడా ఐదు మున్సిపాలిటీలను కై వసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నాయకులు కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
బల్దియా రిజర్వేషన్ల ప్రకటన
ఆశావహుల్లో ఉత్సాహం
రాజకీయ పార్టీల అప్రమత్తం


