ప్రభుత్వంతో కలిసి జగిత్యాల అభివృద్ధికి కృషి
జగిత్యాల: జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంటిపార్టీ అయినట్లు సీనియర్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ప్రజలు గమనిస్తున్నారని తెలపారు. ఆదివారం మోతెలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తనపై అసత్య ఆరోపణలు చేసి.. తన ఇంటిపై.. తన ఆస్పత్రిపై దాడి చేయించారని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, సీనియర్‌గా ఉండి హింసను ప్రోత్సహించరాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉండేదని, ముఖ్యమంత్రిని కలిశాక రూ.34కోట్లు మంజూరు అయ్యాయన్నారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, నరికేస్తా, చంపేస్తా.. అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, హత్య రాజకీయాలను కాదన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఒకప్పుడు టీడీపీ జెండా మోశారని, కాంట్రాక్టర్‌గా ఇంజినీరింగ్ కళాశాలలు, పౌంహౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కేసీఆర్ సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. నాదేండ్ల భాస్కర్‌రావుకు మద్దతు ఇచ్చారని తెలిపారు. తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, సీనియర్ నాయకులకు ప్రశ్నించే హక్కు ఏ మాత్రం లేదన్నారు. పార్టీ ఫిరాయింపు అంశం స్పీకర్ పరిధిలో ఉందని, ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు నాగభూషణం, దామోదర్‌రావు, గట్టు సతీష్, ఖాదర్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఇంటి పార్టీ అన్నట్లు మాట్లాడటం సరికాదు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


