ఉపాధ్యాయ సమస్యలకు త్వరలో పరిష్కారం
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలజోన్: ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్‌లో పీఆర్‌టీయూటీఎస్–2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందున, వాటి స్థితిగతులను మార్చేందుకు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉన్నందున త్వరలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘ నాయకులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బోయనపల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
తపస్ కార్యవర్గ సభ్యులకు అభినందన
జిల్లా తపస్ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభినందించారు. ఉపాధ్యాయ సమస్యలే కాకుండా, ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు సంఘాలు కృషి చేయాలన్నారు. అధ్యక్ష, కార్యదర్శులు బోయినపల్లి ప్రసాద్, కోక్కుల రాజేశ్, నాయకులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, సరస్వతి శిశుమందిర్, శ్రీవాణి జూనియర్ కళాశాలల వ్యవస్థాపకుడు కాసుగంటి సుధాకర్‌రావు శనివారం అనారోగ్యంతో మృతిచెందగా, ఆదివారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.
సొంత జిల్లాలోనే టెట్ నిర్వహించాలి
ధర్మపురి: టెట్ రాసే వారికి ఇతర జిల్లాల్లో కాకుండా సొంత జిల్లాలోనే సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి రొట్టె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడడమే కాకుండా, చాలా మంది పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల సొంత జిల్లాలోనే పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని కోరారు.


