కాకతీయ కాలువకు నీటి షెడ్యూల్ విడుదల
జగిత్యాలఅగ్రికల్చర్: ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు బుధవారం నుంచి నీరు విడుదల చేయనున్న విషయం తెల్సిందే. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు. ఏడు విడతలుగా వారబంధీ పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 24 నుంచి మార్చి 31 వరకు ప్రతిరోజూ నీరు విడుదల చేస్తారు. మొదటి విభాగంలో డిస్ట్రిబ్యూటరీ కాలువ–5 నుంచి 53 వరకు ఏడు రోజులు, రెండో విభాగంలో డి–54 నుంచి 94 వరకు 8 రోజులు విడుదల చేయనున్నారు. మొదటి విభాగానికి నీరు ఇచ్చినప్పుడు రెండో విభాగానికి నీరు వెళ్లకుండా జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి వద్ద కాలువ గేట్లు మూస్తారు. రెండో విభాగానికి నీరు ఇచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటరీ గేట్లను మూసివేస్తారు.
జిల్లాలో 62 డిస్ట్రిబ్యూటరీలు
కాకతీయ ప్రధాన కాల్వ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి వరకు 91 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. డి–21 నుంచి డి–83ఎ వరకు 62 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీ ఆయకట్టు ఏరియాను బట్టి కాలువకు ఎడమ వైపు 25, కుడివైపు మరో 25 మైనర్ కాలువలు ఉంటాయి. ఈ మైనర్ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు వెళ్తుంది.


