
విద్యుత్ తీగలు సరిచేస్తాం
● అదనంగా స్తంభాలు వేస్తాం ● కేబుల్, నెట్ ఆపరేటర్లను హెచ్చరిస్తాం ● అడ్డుగా ఉన్న వైర్లను పరిశీలించిన డీఈ, ఏడీఈ
కోరుట్ల: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని ‘ప్రమాదం పెనవేసుకుంది’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి ట్రాన్స్‌కో అధికారులు స్పందించారు. శుక్రవారం మెట్‌పల్లి డీఈ మధుసూధన్, కోరుట్ల ఏడీఈ రఘుపతి, సిబ్బందితో కలిసి భీమునిదుబ్బ ప్రాంతంలో వినాయకులను తీసుకెళ్లే రోడ్డును పరిశీలించారు. అక్కడ అదనంగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసి వైర్ల ఎత్తు పెంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆ ప్రాంతంలో స్థంభాలను ఆనుకుని అడ్డుగా ఉన్న నెట్, టీవీ కేబుల్ వైర్లను వెంటనే మార్చాలని ఆపరేటర్లకు సూచించారు. ఈసందర్భంగా ఏడీఈ మాట్లాడుతూ, వినాయక నిమజ్జన శోభాయాత్ర కీలకంగా సాగే గాంధీరోడ్, జవహర్‌రోడ్, బురుజు ఏరియా, అంబేడ్కర్‌రోడ్ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ వైర్లతో ఏలాంటి ఇబ్బందులు లేకుండా 8 చోట్ల అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే 1912 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
29న క్రీడా పోటీలు
జగిత్యాల: మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు యువజన క్రీడల అధికారి రవికుమార్ తెలిపారు. 20 ఏళ్ల పైబడిన పురుషులకు క్రికెట్, బ్యాడ్మింటన్, 19 ఏళ్ల బాలురు, బాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని మొదటి, ద్వితీయ బహుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 28లోపు క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 90594 65889 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

విద్యుత్ తీగలు సరిచేస్తాం