
ఇక ‘ఉపాధి’ జాతరే..
జగిత్యాల: జిల్లాలోని 385 గ్రామాల్లో ఈనెల 22న ఒకేరోజు పనుల జాతర ప్రారంభించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అన్ని గ్రామాల్లో రూ.39.11 కోట్ల విలువైన 3,591 పనులు ప్రారంభించనుంది. ఇందులో ఉపాధిహామీ, వాటర్‌షెడ్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఉపాధి కూలీలకు మేలు
కూలీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా సెగ్రిగేషన్ షెడ్, కమ్యునిటీ, శానిటరి, కాంప్లెక్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఇందిరామహిళ శక్తి కింద పశువుల కొట్టాల నిర్మాణం, కోళ్లు, గొర్రెల షెడ్లు, పండ్ల తోటలు, వానపాముల ఎరువుల తయారీ, అజోల్లఫిట్ నిర్మాణం, ఫారంఫాండ్స్, ఫిష్ పాండ్స్, చెక్‌డ్యామ్, ఓపెన్ వెల్, ఊట కుంటలు వంటివి ప్రారంభించనున్నారు.