
కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు
● శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు షురూ ● హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్, క్యాంపస్‌లో లా కళాశాల ● ఎల్‌ఎండీ, క్యాంపస్‌లో ఎంసీఏ కోర్సు మంజూరు ● మూడు ఆడిటోరియంల ఆధునీకరణ ● ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని క్యాంపస్ భూముల రక్షణకు ప్రహరీ ● మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి ఈ నెల 4న శంకుస్థాపన
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
గత వైస్ చాన్స్‌లర్ హయాంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాతవాహన యూనివర్సిటీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. కొత్త కళాశాలలు, కోర్సులతో మరింత విస్తరిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు పొందడంతోపాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్‌లో లా కాలేజీతోపాటు ఫార్మసీ కాలేజీలో ఎంఫార్మసీ కోర్సు, క్యాంపస్‌లో ఎంసీఏ కోర్సు, అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్, లా కాలేజీ నిర్వహణకు 120 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
‘బండి’ సహకారంతో లా కాలేజీకి గుర్తింపు
ఎస్‌యూ క్యాంపస్‌లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులతో లా కాలేజీ ప్రారంభం కాబోతోంది. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్‌లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్‌ఎల్‌ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు మంజూరు చేశారు. లా కాలేజీలో బోధనకు 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అనుమతులు లభించాయి.
ఫార్మసీ కళాశాలకు మహర్దశ
ఎల్‌ఎండీ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఇ న్నాళ్లు బీఫార్మసీ కోర్సు మాత్రమే ఉండేది. తాజాగా ఎంఫార్మసీ ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆ ఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఫార్మసీ కళాశాలలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు గత నెల 22న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ పనులు ప్రారంభించారు.
సదుపాయాలకు పెద్దపీట
వర్సిటీలో సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకాలేజీలు, హాస్టళ్లు, ఆడిటోరియాలు నిర్మిస్తున్నాం. క్యాంపస్‌లో శాతవాహన విగ్రహం ప్రతిష్టించనున్నాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు యూనివర్సిటీ విషయంలో సానుకూలంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలో వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – ఉమేశ్ కుమార్,
వీసీ, శాతవాహన యూనివర్సిటీ
హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరంలో హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కాబోతోంది. ఇందులో సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు మంజూరు చేశారు. ఇందుకోసం 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. బీటెక్‌లో ఒక్కోబ్రాంచ్‌లో 60అడ్మిషన్ల చొప్పున 240 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో ఇప్పటికే 110మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు.
మరెన్నో పనులు
గోదావరిఖని పీజీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఎంబీఏ బ్లాక్ వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలో గతంలో ఉన్న పాత సెమినార్ హాల్‌ను సరికొత్త సీటింగ్, సౌండ్ సిస్టంతో ఆధునీకరించి మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, అన్ని డిపార్ట్‌మెంట్లు, ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని పీజీ కాలేజీలో డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేశారు.
మరో రెండు కొత్త హాస్టళ్లు
శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. యూనివర్సిటీలో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్‌లో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ హాస్టళ్ల పనులకు ఈ నెల 4న శంకుస్థాపన చేసేందుకు జిల్లా ఇన్‌చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఆహ్వానించినట్లు వీసీ ఉమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీతో పాటు, సెంట్రల్ లైబ్రరీలో సెమినార్ హాల్ ఆధునీకరణ, పరిపాలన భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న నూతన సెమినార్ హాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు

కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు