
‘డబుల్’ అర్హుల సర్వే
జగిత్యాల: పేదలకు గూడు కల్పించాలనే
ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకేంద్రం శివారులోని నూకపల్లిలో డబుల్‌బెడ్‌రూం నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ఇక్కడ 4,520 ఇళ్లు నిర్మించారు. దాదాపు ఇళ్లన్నీ పూర్తయ్యాయి. లబ్ధిదారులను డ్రా పద్ధతిన ఎంపిక చేసి ఇళ్లను కేటాయించారు. ప్రస్తుతం సుమారు 880 వరకు ఇంకా ఖాళీగా ఉన్నాయి. వీటిని లబ్ధిదారులకు కేటాయించేందుకు ఇటీవలే కలెక్టర్ సత్యప్రసాద్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. జగిత్యాలకు చెందిన 1088 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి వివరాలు సేకరిస్తున్న అధికారులు.. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేపడుతున్నారు.
● యాప్‌లో నమోదు చేసిన అధికారులు ● అన్ని అర్హతలుంటేనే ఇల్లు కేటాయింపు
● పకడ్బందీగా చేపడుతున్న అధికారులు
48 మందికి కేటాయింపు
డబుల్‌బెడ్‌రూంల కోసం దరఖాస్తు చేసుకున్న 1088 మందిలో అర్హులెవరు.. అనర్హులెవరూ.. తెలుసుకునేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇందులో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీడీవోలు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో సర్వే కొనసాగుతోంది. కచ్చితంగా అర్హులైన వారికే ఇళ్లు దక్కేలా పకడ్బందీగా సర్వే చేపడుతున్నారు. దీనికి 360 డిగ్రీల్లో ఓ యాప్‌ను ఏర్పాటు చేసి అందులో వీరి వివరాలు పొందుపర్చి కలెక్టర్‌కు పంపించనున్నారు. ప్రభుత్వానికి వెళ్లిన అనంతరం అర్హులైన వారి లిస్ట్ గృహ నిర్మాణశాఖకు రానుంది.
గతంలో అనేక తప్పిదాలు
నూకపల్లిలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో గ తంలో అనేక తప్పిదాలు జరిగాయి. ఆ శాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి ఏకంగా అనుకూలమైన వ్యక్తులకు కేటాయించడంతో సస్పెండ్ అయ్యారు. ఈ సారి అలాంటిదేమీ చేయకుండా పకడ్బందీగా సర్వే చేపడుతున్నారు. గతంలో డ్రా పద్ధతిలో ఏర్పాటు చేసి మినీస్టేడియంలో అందరిముందే డ్రా తీశారు. డ్రా తీసి జాబితాను రూపొందించారు. ఆ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇతర మండలాలకు చెందిన వారిని కొంత మందిని జాబితాలో చేర్చడంతో అనేకమంది అర్హులు కాని వారికి డబుల్‌బెడ్‌రూంలు దక్కాయి. ఈసారి అలాంటివి జ రగకుండా ఉండాలనే ఉద్దేశంతో తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవోలు మొత్తం 48 మంది సర్వే చేస్తున్నారు.
అభివృద్ధికి ఊతం
నూకపల్లి సమీపంలో 4520 డబుల్‌బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో అతిపెద్ద కాలనీగా అవతరించింది. దీనిని మున్సిపాలిటీలో కూడా విలీనం చేశా రు. ఇక్కడే రాష్ట్ర ఆవిర్భావానికి ముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించింది. కానీ.. అవి పునాదుల వరకు.. కొన్ని స్లాబ్ వరకే నిర్మించుకుని వదిలేశారు. తాజాగా డబుల్‌బెడ్‌రూం కాలనీ వద్ద అంగన్‌వాడీ సెంటర్, స్కూల్ బిల్డింగ్, ఆస్పత్రి వంటి సౌకర్యాల నిర్మాణం చేపట్టేందుకు స్థలం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ని ర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కూల్చివేశారు. ఇది వివా దాస్పదంగా మారింది. గతంలో తమకు కేటాయించిన ఇళ్లను కూల్చివేశారంటూ కలెక్టర్‌కు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా ఆ కాలనీని సందర్శించి పేదలకు అన్యాయం చేయొద్దని అధికారులకు సూచించారు. మరోవైపు బాధితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రకటించారు.
అర్హుల
ఎంపిక కోసం
సర్వే
డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కోసం 1088 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సర్వే చేస్తున్నాం. పక్కాగా అర్హులైన వారికే ఇళ్లు కేటాయిస్తాం. వివరాలన్నీ యాప్‌లో నమోదు చేస్తున్నాం.
– రాంమోహన్, అర్బన్ తహసీల్దార్