కోరుట్ల: నో.. ప్లాస్టిక్ నినాదంతో కోరుట్ల బల్దియాలో శుక్రవారం నుంచి ప్రత్యేక కార్యాచరణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కేవలం ప్రచారంతో సరిపెట్టుకోకుండా క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి గట్టి చర్యలకు ఏర్పాట్లు చేసింది. 15 రోజులుగా మహిళాసంఘాల ద్వారా పట్టణంలోని అన్ని ఇళ్లకు బట్టసంచులు అందేలా చర్యలు చేపట్టింది. ఇక ప్లాస్టిక్ అమ్మకాలపై దృష్టి సారించారు.
సగం ప్లాస్టిక్ వ్యర్థాలే..
కోరుట్లకు సంబంధించి కల్లూర్‌రోడ్‌లో డంప్‌యార్డు ఏర్పాటు చేశారు. బల్దియాలోని 33వార్డుల్లో ప్రతిరోజూ సుమారు టన్ను చెత్త వెలువడుతుంది. ఈ చెత్తను వార్డుల వారీగా ఏర్పాటు చేసిన ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. ఇలా తరలిస్తున్న చెత్తలో సగానికి మించి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండటం గమనార్హం. ఇటీవల మున్సిపల్ కమిషనర్ రవీందర్ వేకువజామున డంప్ యార్డుకు వెళ్లి పరిశీలించగా అందులో సగానికి మించి ప్లాస్టిక్ వ్యర్థాలే ఉండటం..అవి నాశనం కాకపోవడంతో మళ్లీ అదనంగా చెత్త వేయడానికి స్థలం లేకుండాపోవడం సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకుని కాలిపోయి పొగతో పాటు కార్బన్‌మోనాకై ్సడ్ వంటి విషవాయువు విడుదల కావడంతో చుట్టుపక్క ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన కమిషనర్ ముందుగా పట్టణంలో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండొద్దన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
నేటి నుంచి కోరుట్ల బల్దియాలో ప్రత్యేక చర్యలు
భారీగా జరిమానాలకు రంగం సిద్ధం
గోదాముల్లో తనిఖీకి బృందాలు
ఇంటింటికీ బట్ట సంచులు పంపిణీ
ఇంటింటికీ బట్ట సంచులు
పట్టణంలోని 33వార్డుల్లో సుమారు 27వేల వరకు నివాసాలు ఉన్నాయి. పట్టణంలోని అన్నివార్డుల్లో మహిళాసంఘాల గ్రూపుల్లో పూర్తిస్థాయిలో మహిళల భాగస్వామ్యం ఉంది. వారం క్రితం మహిళాసంఘాల ఆర్పీల ద్వారా గ్రూపుల్లోని అన్ని సంఘాల మహిళకు బట్ట సంచులు అందించారు. అంతేకాకుండా మహిళా సంఘాల సభ్యులతో డంప్‌యార్డు వద్ద ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ పేరుకుపోవడంతో ఏర్పడుతున్న దుర్భర పరిస్థితిపై అవగాహన కల్పించారు. సరుకుల కోసం ప్రతిఒక్కరూ బట్ట సంచులు వాడేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్టిక్ నివారణకు అన్ని వర్గాలు కలిసిరావాలని ఆటోల ద్వారా వారం రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ప్లాస్టిక్ సంచుల అమ్మకాలు నిలిపేయాలని లేకుంటే రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని వ్యాపారవర్గాలకు సూచించారు. గోదాముల్లో ప్లాస్టిక్ నిల్వలు ఉంచినా చర్యలు తప్పవని ప్రచారం చేశారు. చివరగా శుక్రవారం నుంచి ప్లాస్టిక్ నివారణకు క్షేత్రస్థాయిలో అన్ని వార్డుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గట్టి చర్యలకు సిద్ధం కావడంతో కొంతలోకొంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.