పచ్చిరొట్ట ధరలు రెట్టింపు
● రేటు భారీగా పెంచడంతో రైతుల్లో అయోమయం ● సబ్సిడీ కూడా 60శాతం నుంచి 50 శాతానికి తగ్గింపు ● జిల్లా రైతులపై రూ.5.52 కోట్ల అదనపు భారం
జగిత్యాలఅగ్రికల్చర్: పచ్చిరొట్ట విత్తనాల ధరలను ప్రభుత్వం అమాంతం పెంచింది. గతేడాదితో పోల్చితే ధర రెట్టింపు పెరగగా.. సబ్సిడీ కూడా పది శాతం తగ్గించింది. దీంతో రైతులు అయోమయంలో పడుతున్నారు. భూములకు పుష్టి ఇచ్చేందుకు తొలకరికి ముందుగానే జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట సాగు చేస్తారు రైతులు. ఈ విత్తనాలపై గతేడాది 60 శాతం సబ్సిడీ ఇవ్వగా.. ఈ ఏడాది 50 శాతానికి కుదించారు. విత్తనాల ధరలు కూడా రెట్టింపు చేశారు. ఈ లెక్కన జిల్లా రైతులుపై సుమారు రూ.5.52 కోట్ల భారం పడనుంది. ఇటు సబ్సిడీ తగ్గింపు, అటు విత్తనాలు రేట్లు పెరగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
23 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
జిల్లా రైతుల కోసం 23వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇటీవల 15వేల క్వింటాళ్ల జనుము, 1600 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను మాత్రమే అలాట్ చేశారు. ఇప్పటివరకు 9వేల క్వింటాళ్ల జీలుగ, 300 క్వింటాళ్ల జనుము మాత్రమే జిల్లాకు చేరింది. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సింగిల్‌విండోలు, డీసీఎంఎస్ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో సోమవారం నుంచి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ ఏడాది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలకు విత్తనాలను సరఫరా చేయడం లేదు.
పెరిగిన విత్తనాల ధరలు
విత్తనాల ధరలు రెట్టింపయ్యాయి. 30 కిలోల జనుము, 40 కిలోల జీలుగ బస్తాలను పంపిణీ చేస్తారు. గతేడాది జీలుగ కిలో ధర రూ.93 ఉండగా.. అందులో రూ.55.80 సబ్సిడీ ఇచ్చేవారు. రైతు కిలోకు రూ.37.20 చెల్లించేవారు. జనుము కిలోకు రూ.90.50 కాగా.. రూ.54.30 సబ్సిడీ పోను రైతు కేవలం రూ.36.20 చెల్లించేది. ప్రస్తుతం జీలుగ కిలో ధర రూ.142.50కు పెంచారు. ఇందులో సబ్సిడీ రూ.71.25 పోను రైతు రూ.71.25 చెల్లించాలి. జనుము కిలో రూ.125.50 ఉండగా.. సబ్సిడీ రూ.62.75 ఇస్తున్నారు. రైతులు రూ.62.75 చెల్లించాల్సి వస్తుంది. గతేడాదితో పోల్చితే జీలుగ కిలోకు రూ.34 పెరిగింది. జనుము కిలోకు రూ.26.55 పెరిగింది. 30 కిలోల జీలుగ బస్తాకు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా రూ.1020 చెల్లించాల్సి వస్తోంది. 40 కిలోల జనుము బస్తా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.1062 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మొత్తంగా రైతులు 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2,137, జనుము బస్తాకు రూ.2,510 చెల్లించాల్సి ఉంది.
50 శాతానికి సబ్సిడీ తగ్గింపు
విత్తనాల సబ్సిడీని గతేడాదితో పోల్చితే 10 శాతం తగ్గించారు. గతేడాది సబ్సిడీ 60శాతం ఇస్తే.. ఈ ఏడాది 50 శాతానికి కుదించారు. ఈ లెక్కన జీలుగ బస్తాపై రూ.102అధిక భారం పడుతుంది. జనుము బస్తాకు రూ.106.20 అదనపు భారం పడుతుంది. దివంగత వైఎస్ హయాంలో పచ్చిరొట్ట విత్తనాలపై 75శాతం సబ్సిడీ ఇచ్చారు.


