ప్రైవేటు ఉద్యోగి నుంచి జూనియర్ సివిల్ జడ్జి వరకు..
● కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ● ఆదర్శంగా నిలుస్తున్న నరేశ్
జగిత్యాల: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. తల్లి గృహిణి. తండ్రి హమాలీ. అయినా అతడు కష్టపడి చదివాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రైవేటులో చిన్నపాటి ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో పుస్తకాలతో కుస్తీపట్టారు. ప్రస్తుతం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కనకయ్య, యాదవ్వ దంపతుల కుమారుడు నరేశ్. కనకయ్యది నిరుపేద కుటుంబం కావడంతో గ్రామంలో అద్దెకుంటూ జగిత్యాలలో హమాలీ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమార్తె భవాని పెళ్లి అయ్యింది. మరో కూతురు భార్గవి ప్రైవేటు టీచర్‌గా కొనసాగుతోంది. నరేశ్ హైదరాబాద్‌లో ఒ చిన్న కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో 2024లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఇటీవల జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు రాయగా ఎంపికయ్యారు. నరేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికవడంతో వారి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో
నా విజయం వెనుక కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి చదివాను. ముఖ్యంగా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డారు. అక్క భవాని, బావ, చెల్లి భార్గవి సైతం ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికవడం ఎంతో ఆనందంగా ఉంది. – నరేశ్
ప్రైవేటు ఉద్యోగి నుంచి జూనియర్ సివిల్ జడ్జి వరకు..


