
● బలం ఉన్న నాయకులపై ప్రధాన పార్టీల అభ్యర్థుల దృష్టి ● నిత్యం జంపింగ్‌లతో ప్రజల్లో అయోమయం ● జిల్లాలో పరిస్థితి
జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కన్నా తమ పార్టీలో చేరికలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బలమైన ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెడుతూ వారిని చేర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన అనేక మంది నిత్యం ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారుతున్నారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపడుతూ గ్రామాల్లో ఎవరెవరు ముఖ్య నాయకులు, కార్యకర్తలున్నారో ఆరా తీస్తున్నారు. అలాగే, వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను సైతం తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్య నాయకులకు బాధ్యతలు
అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతుండగా ఆయా పార్టీల్లోని ముఖ్య నాయకులకు చేరికల బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారు ఏ నాయకుడిని పార్టీలో చేర్చుకుంటే లాభం జరుగుతుందో అంచనా వేస్తూ చాలామందిని ఆహ్వానిస్తున్నారు. ఫలితంగా ప్రధాన పార్టీలో నిత్యం జంపింగ్‌లతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారో తెలియడం లేదని అంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో మూడు నియోజకవర్గాల్లో 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో 12 రోజులు మాత్రమే ప్రచార గడువు ఉండటంతో చేరికలు ఊపందుకున్నాయి. ముఖ్య నాయకులు రాత్రంతా గ్రామాల్లో, పట్టణాల్లోనే గడుపుతూ పలువురిని అభ్యర్థుల ఇంటికి తీసుకెళ్లి, మాట్లాడిస్తున్నారు. చర్చలు సఫలమైతే కండువాలు కప్పేస్తున్నారు.