'వీళ్లతో మాట్లాడాక.. హాయ్‌ పెడతా'.. 24 గంటల్లోనే వీడిన మిస్టరీ.. | - | Sakshi
Sakshi News home page

'వీళ్లతో మాట్లాడాక.. హాయ్‌ పెడతా'.. 24 గంటల్లోనే వీడిన మిస్టరీ..

Aug 6 2023 12:30 AM | Updated on Aug 6 2023 1:46 PM

- - Sakshi

జగిత్యాల: ‘నేను వీళ్లతో మాట్లాడుతున్న.. తర్వాత నీకు హాయ్‌ పెడత.. అప్పుడు ఫోన్‌ చెయ్‌’ అని ఓ వివాహితకు పెట్టిన చివరి వాయిస్‌ మేసేజ్‌ సమీర్‌ హత్య కేసు నిందితులను పట్టించింది. బుధవారం రాత్రి కనిపించకుండా పోయిన పట్టణానికి చెందిన సమీర్‌(25) మృతదేహం పట్టణ శివారులోని ఎస్సారెస్పీ డీ–40 కెనాల్‌లో లభించడం కలకలం రేపింది. యువ కుడి మృతదేహం లభించిన 24 గంటల వ్యవధిలోనే సీఐ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సై కిరణ్‌.. నిందితులను అదుపులోకి తీసుకోవడం విశేషం.

వివాహితతో సాన్నిహిత్యం..
ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న షేక్‌ సమీర్‌ కొంతకాలంగా ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో ఇప్పటికే సన్నిహితంగా ఉండే మరో వ్యక్తికి ఇది నచ్చలేదు. దీంతో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సంగెం మెయిన్‌ కెనాల్‌కు అనుబంధంగా ఉన్న డీ–40 కెనాల్‌ వద్దకు వచ్చిన ఇద్దరు.. సమీర్‌తో గొడవ పడ్డట్లు సమాచారం.

ఈ సమయంలోనే సమీర్‌.. తాను ‘హాయ్‌’ పెట్టేవరకు ఫోన్‌ చేయద్దని సదరు వివాహిత ఫోన్‌కు వాయిస్‌ మేసేజ్‌ పంపినట్లు సమాచారం. సమీర్‌తో గొడవ పడ్డ ఇద్దరు అతడిని హతమార్చి మోటార్‌సైకిల్‌తో సహా మెయిన్‌ కెనాల్‌లోకి తోసేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డీ–40 కాలువలో సమీర్‌ మృతదేహం కొట్టుకువచ్చి ఇటుక బట్టీల వద్ద తేలింది.

సమీర్‌ బావ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. వాయిస్‌ మేసేజ్‌ ఆధారంగా విచారణ చేసి సమీర్‌ హత్యలో పాలుపంచుకున్న ఇద్దరిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని విచారించిన సీఐ ప్రవీ ణ్‌కుమార్‌, ఎస్సై కిరణ్‌.. శనివారం ఉదయం సంగెం మెయిన్‌ కెనాల్‌లో సమీర్‌ తీసుకెళ్లిన మోటార్‌సైకిల్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మొత్తమ్మీద 24 గంటల వ్యవధిలోనే పోలీసులు సమీర్‌ హత్యోదంతంలో మిస్టరీని ఛేదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement