ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు?

Jagtial police Fires On Rowdy sheeters  - Sakshi

జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా, నేరాల నియంత్రణ ధ్యేయంగా జిల్లా పోలీసు శాఖ రౌడీషీటర్ల కదలికలపై నిఘా తీవ్రతరం చేసింది. కొద్దిరోజులుగా వివిధ గ్రామాలు, పట్టణాల్లో చోటుచేసుకుంటున్న హత్యలు, చోరీలు, అసాంఘిక కార్యకలాపాల నేపథ్యంలో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. ప్రధానంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో వరుస చోరీలు, అదేప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి హత్య, ఆ తర్వాత దహనం కేసులను సవాల్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. తొలుత రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

తీరు మారడంలేదని..
● జిల్లాలో మొత్తం 182 మంది రౌడీషీటర్లు ఉన్నారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

● వీరిలో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ తరచూ కౌన్సెలింగ్‌ ఇస్తోంది. అయినా, కొందరి తీరు మారడంలేదని గుర్తించింది.

● వీరు హత్యలు, అపహరణలు, రౌడీయిజం, దౌర్జన్యాలు, కుమ్ములాటలు, గొడవలు, బెదిరింపులు, భూదందాల్లో జోక్యం చేసుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు.

● ఇలాంటివారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుస్టేషన్ల వారీగా నిఘా పెంచారు.

● ప్రధానంగా గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీీషీటర్లు, వారిఅనుచరుల చిట్టాను ఎప్పటికప్పుడు తిరగేస్తున్నారు.

● చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగిస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నారు.

● కొందరిని ఠాణాకు పిలిపించి తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేస్తున్నారు.

● ఆ తర్వాత రూ.లక్ష – రూ.ఐదు లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెడుతున్నారు.

● అంతేకాదు.. భవిష్యత్‌లో అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో వ్యవహరిస్తామని వారినుంచి హామీ తీసుకుంటున్నారు.

● మరోవైపు.. రౌడీషీటర్లలో ఒకరిద్దరు చోటామోటా నాయకులు కూడా ఉండటం గమనార్హం.

నేరాల తీవ్రత ఆధారంగా కేసులు..
గతేడాది జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌ ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో ఐదుగురిపై పీడీయాక్ట్‌ నమోదు చేశారు. నేరాల తీవ్రత ఆధారంగా నేరస్తులపై రౌడీషీట్‌ తెరుస్తున్నారు. 20ఏళ్ల క్రితం రౌడీీషీట్‌ నమోదై.. ఇంకా నేరాలు కొనసాగిస్తున్న వారినుంచి.. కొత్తగా రౌడీషీషీట్‌ నమోదైనవారూ ఈ జాబితాలో చేరారు.

నేరస్తులపై నిఘా పెంచాం
జిల్లాలో రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచాం. పోలీస్‌స్టేషన్ల వారీగా నిఘా పటిష్టం చేశాం. జిల్లాలో తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తున్నాం.

భాస్కర్‌, ఎస్పీ

ఇతర జిల్లాలకు రౌడీషీటర్లు..
రౌడీషీటర్లుగా పోలీసు రికార్డుల్లో చేరిన కొందరు ఇతర జిల్లాలు, ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అక్కడ ఎవరి కంటాపడకుండా చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటివారి కదలికలపైనా జిల్లా పోలీసులు నిఘా పెంచారు. తొలుత అక్కడి పోలీసులకు సమచారం అందించి రౌడీషీటర్ల కదలికలు గమనిస్తున్నారు.

Read latest Jagtial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top