
అప్పటిదాకా రష్యాతో చర్చల్లేవ్
కుండబద్దలు కొట్టిన జెలెన్‌స్కీ
ఖనిజాల ఒప్పందానికి సిద్ధమే
థాంక్యూ అమెరికా, థాంక్యూ ట్రంప్
‘ఓవల్’ రగడ తర్వాత ఎక్స్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుని పోస్టులు
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికాతో బలమైన బంధాన్ని ఆకాంక్షిస్తున్నామని ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యాతో మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు దన్నుగా నిలుస్తున్నందుకు అమెరికాకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదని, కాల్పుల విరమణకు ఒప్పుకోకుండా లక్షలాది మంది ఉక్రేనియన్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారని శుక్రవారం చర్చల్లో ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే.
దాంతో వారి భేటీ అర్ధ్ధంతరంగా ముగియడమే గాక అమర్యాదకర పరిస్థితుల్లో జెలెన్‌స్కీ వైట్‌హౌస్‌ను వీడారు. తర్వాత శనివారం ఆయన ఎక్స్‌లో పలు పోస్టులు చేశారు. ‘‘అమెరికా ప్రజలకు, ముఖ్యంగా ట్రంప్‌కు, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. ఆ దిశగానే కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ట్రంప్ మద్దతు మాకు చాలా కీలకం. యుద్ధానికి తెర దించాలని ఆయన కాంక్షిస్తున్నారు. కానీ మాకంటే శాంతికాముకులు ఇప్పుడు ఇంకెవరూ ఉండబోరు. ఇది మా స్వేచ్ఛ కోసం, ఇంకా చెప్పాలంటే ఉనికి కోసం జరుగుతున్న పోరు. అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం.
ఇరు దేశాల ఆర్థిక, రక్షణపరమైన బంధాలను ఇది బలోపేతం చేయగలదు. కానీ మాకు కేవలం ఈ ఒప్పందాలు మాత్రమే చాలవు. ఉక్రెయిన్ రక్షణకు సరైన హామీలు లేకుండా కాల్పుల విరమణకు ఒప్పుకోవడం మా దేశాన్ని ముప్పులో పడేస్తుంది. రష్యా మరోసారి మాపై దురాక్రమణకు దిగకుండా కచ్చితమైన హామీలు కావాల్సిందే. అప్పటిదాకా రష్యాతో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదు. అమెరికా పూర్తిగా మావైపే ఉందని ఉక్రేనియన్లందరికీ విశ్వాసం కలిగించడం ఇప్పుడు చాలా ముఖ్యం’’ అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ట్రంప్‌తో వాగ్యుద్ధం ఇరు పక్షాలకూ మంచి చేయలేదని అభిప్రాయపడ్డారు.