ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జర్మన్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. చేసిన వ్వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం - మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతలు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతున్నాయి.
జెలెన్‌స్కీ అమెరికా శాంతి చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూఎస్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ప్రస్తుతం ఇరాన్ చర్చలలో నిమగ్నమై ఉండటం వల్ల ఉక్రెయిన్ సమస్యపై తగిన శ్రద్ధ చూపలేకపోతున్నారని తెలిపారు. అంతే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin)పై అమెరికా కఠినమైన ఒత్తిడి తీసుకురాకపోతే యుద్ధం ముగిసే అవకాశాలు తగ్గిపోతాయి. కేవలం చర్చలు మాత్రమే చేస్తే, రష్యా నాయకత్వం భయపడదని ఆయన పేర్కొన్నారు.
ఇక, ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి వచ్చే ఆయుధాల సరఫరా కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా గాలి రక్షణ కోసం ఉపయోగించే PAC-2, PAC-3 మిసైళ్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ ఆయుధాలు పీయూఆర్ఎల్ కార్యక్రమం ద్వారా యూరోపియన్ దేశాల సహకారంతో కొనుగోలు చేస్తున్నారు. కానీ మధ్యప్రాచ్యంలోని యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ సరఫరాలు ఆలస్యంగా వస్తున్నాయని జెలెన్స్కీ చెప్పారు.
జెలెన్‌స్కీ, నార్వే ప్రధానితో సమావేశమై రక్షణ రంగంలో సహకారం పెంపొందించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్ డ్రోన్లు నార్వేలో తయారవుతాయి. ఇది రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో మరింత బలమైన భాగస్వామ్యానికి దారి తీస్తుంది. అంతేకాకుండా, జెలెన్‌స్కీ జర్మనీకి వెళ్లి చాన్సలర్ Friedrich Merzతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించడంతో పాటు రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించారు.


