World Longest Glass Bridge: చైనాకు ధీటుగా మరో కట్టడం.. అబ్బురపరుస్తున్న వీడియో

World Longest Glass Bridge Is Nearly Complete In Vietnam - Sakshi

ప్రపంచంలోని ఎన్నో వింతల్లో మరో విశేష కట్టడం చేరబోతోంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించేందుకు వియత్నాం వేదికైంది. ప్రపంచంలోనే అతిపొడవైన గాజు వంతెనను వియత్నాంలోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో నిర్మించారు. ఈ గాజు వంతెన పొడవు 2,073.5 అడుగులు ఉండగా.. భూమి నుంచి వంతెన ఎత్తు సుమారుగా 500 అడుగుల ఎత్తులో ఉంది. కాగా, ఈ వంతెనను ఏప్రిల్‌ 30వ తేదీన ఓపెన్‌ చేయబోతున్నారు. 

ఈ వంతెనపై ఇప్పటికే అధికారులు భద్రతను పరిశీలించారు. అనంతరం సోన్ లా ప్రావిన్స్‌లోని మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా అధికారులు.. ఈ గాజు వంతెన అధికారిక పొడవు ప్రపంచంలోనే ఎక్కువగా ఉండటంతో వంతెన గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు సమర్పించినట్లు తెలిపారు. ఇక, ఈ వంతెనపైకి ఒక్కసారి 500 మంది మాత్రమే నడవడానికి అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ వంతెన నిర్మాణానికి ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్ ఉత్పత్తి చేసిన సూపర్ టెంపర్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు.

ఇక, చైనాలో కూడా ఓ గాజు వంతెనను నిర్మించిన విషయం తెలిసిందే. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై 1,410.7 అడుగుల పొడవుతో గాజు వంతెన ఉంది. ఈ వంతెన ప్రస్తుతం పొడవైనదిగా గిన్నిస్‌ రికార్డుల్లో ఉంది. కాగా, ఈ వంతెనను 2016లో ఓపెన్‌ చేశారు. అప్పటి నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వంతెనకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌ అయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top