60 ఏళ్లకు గర్భం దాల్చి తల్లి అయ్యి.. 76 ఏళ్ల వయసులోనేమో.. | Woman who gave birth to twins at 60 becomes viral livestreamer at 76 after years of tragedy | Sakshi
Sakshi News home page

60 ఏళ్లకు గర్భం దాల్చి తల్లి అయ్యి.. 76 ఏళ్ల వయసులోనేమో..

May 17 2026 9:22 PM | Updated on May 17 2026 9:25 PM

Woman who gave birth to twins at 60 becomes viral livestreamer at 76 after years of tragedy

బీజింగ్‌: చైనాలో 16 ఏళ్ల క్రితం 60 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది ఓ బామ్మ. గర్భం దాల్చిన అత్యధిక వయసున్న మహిళగా అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆ మహిళకు ఇప్పుడు 76 ఏళ్లు. వ్యక్తిగతంగా ఎన్నో విషాదాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆమె ఈ వయసులో సోషల్ మీడియా ద్వారా తనను తాను నిరూపించుకుంది.

ఆ బామ‍్మ పేరు షెంగ్ హైలిన్. ఆమె జీవిత ప్రయాణాన్ని చూపించిన ఫోటో సిరీస్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొన్ని ఏళ్లుగా కష్టపడి షెంగ్ చైనా సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. సోషల్‌ మీడియాలో ఆమె పేరెంటింగ్ సలహాలు, వంట వీడియోలు, ప్రేరణాత్మక విషయాలు పంచుకుంటోంది.

60 ఏళ్ల వయసులో పిల్లలు ఎందుకు? 
షెంగ్ ఏకైక కుమార్తె టింగ్‌టింగ్, అల్లుడు పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే 2009లో కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావంతో మృతి చెందారు. ఆ విషాదం, ఒంటరితనంతో తీవ్రంగా కలత చెందిన షెంగ్, 60 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయం చైనాలో సంచలనం రేపింది.

గర్భధారణ సమయంలో తీవ్రమైన వాపులు, రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, షెంగ్ 2010లో జిజి, హుయ్‌హుయ్ అనే కవల పాపలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.  

షెంగ్, ఆమె భర్త జీవితాల్లో ఆ కవల పిల్లలు కొత్త ఆశ నింపినా వృద్ధాప్యంలో పిల్లలను పెంచడం సవాలుగా మారింది. షెంగ్ పదవీ విరమణకు ముందు ఆసుపత్రి డైరెక్టర్‌గా పని చేసింది. ఆమె భర్త యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అయినా పిల్లల సంరక్షణ, విద్య, రోజువారీ ఖర్చులు కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి.

కుటుంబాన్ని పోషించడం కోసం షెంగ్ చైనా అంతటా తిరుగుతూ ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చింది. తన కుమార్తెలకు నాణ్యమైన విద్యతో పాటు పియానో, డ్యాన్స్ వంటి శిక్షణ అందించేందుకు ఆమె నిరంతరం శ్రమించింది.

అయితే, 2016లో షెంగ్ భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబం మరో భారీ విషాదాన్ని ఎదుర్కొంది. అనంతరం గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన 2022లో మృతి చెందారు. అదే సమయంలో నకిలీ పెట్టుబడి మోసంలో షెంగ్ 20 లక్షల యువాన్‌లకుపైగా డబ్బు కోల్పోయిందని సమాచారం.

షెంగ్ ఆన్‌లైన్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. 73 ఏళ్ల వయసులో లైవ్‌స్ట్రీమింగ్, షార్ట్ వీడియోలను ప్రారంభించింది. కుమార్తెల భవిష్యత్తు కోసం సంపాదించడం కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. ప్రస్తుతం ఆమె తరచుగా లైవ్‌స్ట్రీమ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరెంటింగ్, వృద్ధాప్యం, రోజువారీ జీవితం గురించి మాట్లాడుతోంది. ఇంటి సామగ్రి, ఆరోగ్య సంబంధిత వస్తువులు కూడా విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో “మదర్ షెంగ్” పేరుతో ప్రసిద్ధి చెందిన ఆమె అనేక మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement