వందేళ్లు బతకడం వెనుక..! | Why Women In This Italian Village Live Longer, The Secrets Behind Their 100 Year Lifespans, Read Story Inside | Sakshi
Sakshi News home page

వందేళ్లు బతకడం వెనుక..!

Oct 9 2026 4:29 PM | Updated on Oct 9 2026 4:54 PM

Why Women In This Small Italian Village Live Exceptionally Long Lives

ఇటలీలోని ఓ చిన్న గ్రామానికి చెందిన మహిళలు అసాధారణ రీతిలో దీర్ఘాయుష్షును సొంతం చేసుకుంటూ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నారు. వీరి సుదీర్ఘ జీవితాల వెనుక ఏదైనా ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయా? రోజువారీ నడక, కుటుంబ సభ్యులతో అనుబంధాలు, కలిసిమెలిసి జీవించే విధానమే వీరి ఆయుర్దాయాన్ని పెంచుతున్నాయా? అసలు ఈ మహిళలు ఇంతకాలం ఆరోగ్యంగా జీవించడానికి కారణాలేంటో పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

మరో ‘బ్లూ జోన్‌’గా..!
ఇటలీలోని సార్డీనియా పర్వత ప్రాంతాల్లో ఉన్న బోలోటానా (Bolotana) గ్రామంలో 70 ఏళ్ల వయసు ఉన్న మహిళల్లో సుమారు 13.8 శాతం మంది 100 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని.. అదే ఇటలీలోని మహిళల్లో ఈ శాతం 3.5గా, అమెరికా మహిళల్లో 3.6గా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు బోలోటానా గ్రామం ప్రపంచంలోని మరో ‘బ్లూ జోన్‌’గా గుర్తింపు పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు అసాధారణమైన దీర్ఘాయుష్షును పొందే ప్రాంతాలను బ్లూ జోన్లుగా పిలుస్తారు. అయితే, ఈ గ్రామంలో ప్రజలు ఇంత ఎక్కువ కాలం జీవించడానికి కారణాలేమిటో నిర్ధారించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

విశ్లేషణ ఇలా..
సుమారు 2,300 మంది జనాభా ఉన్న బోలోటానా గ్రామానికి సంబంధించిన జనాభా రికార్డులను పరిశోధకులు విశ్లేషించారు. 2021 నుంచి 2025 వరకు వృద్ధుల మనుగడకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ముఖ్యంగా 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత వారు ఎంతకాలం జీవించారనే అంశంపై దృష్టి పెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ ఎమెరిటస్ ఎస్. జే ఓల్షాన్స్కీ ఈ అధ్యయనం చేపట్టారు.

100 ఏళ్లు.. అంతకంటే
బోలోటానా ప్రత్యేకత గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. ఈ గ్రామంలో పుట్టిన, మరణించిన వ్యక్తుల వయసును నిర్ధారించడానికి వీలైనంత విశ్వసనీయమైన చారిత్రక రికార్డులు ఉన్నాయని తెలిపారు. మున్సిపల్ రికార్డులతో పాటు చర్చిల్లో భద్రపరిచిన బాప్తిస్మ రికార్డులు కూడా శతాబ్దాల నాటి వివరాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ రికార్డులను పరిశీలించి, 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించిన వారి వయసును పరిశోధకులు ధ్రువీకరించారు. 1900 నుంచి 1925 మధ్య బోలోటానాలో జన్మించిన 3,060 మందిలో 38 మంది శతాధిక వృద్ధులు ఉన్నట్లు నమోదు చేశారు.

బోలోటానా మహిళల్లో 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత సగటున మరో 21 ఏళ్లకు దగ్గరగా జీవించే అవకాశమున్నట్లు అధ్యయనం అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోనూ పరిశోధకులు ఈ గణాంకాలను పోల్చారు. 70 ఏళ్ల వయసు తర్వాత మిగిలిన జీవితకాలం, 100 ఏళ్లకు చేరుకునే అవకాశాల పరంగా హాంకాంగ్ మహిళల తర్వాత బోలోటానా మహిళలు రెండో స్థానంలో నిలిచినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే, సార్డీనియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ధోరణి భిన్నంగా కనిపించిందని ఆయన తెలిపారు. ఈ అసాధారణ పరిస్థితులే ఈ ప్రాంతాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయని పరిశోధకులు పేర్కొన్నారు. బోలోటానా ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి కచ్చితమైన కారణాలను ఈ అధ్యయనం నిర్ధారించలేదు. అయితే, వారి జీవన శైలిలోని కొన్ని అంశాలు దీర్ఘాయుష్షుకు దోహదపడే అవకాశముందని పరిశోధకులు గుర్తించారు.

రోజువారీ నడక: బోలోటానాలో ఎత్తుపల్లాలు, కొండ ప్రాంతాలు, వాలుగా ఉండే వీధులు ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రజలు తమ రోజువారీ పనుల కోసం నడవాల్సి వస్తుంది. కార్లపై ఆధారపడకుండా నడకకు ప్రాధాన్యం ఇవ్వడం శారీరక చురుకుదనాన్ని పెంచవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

స్థానిక ఆహారపు అలవాట్లు: గ్రామంలో అనేక ఆహార పదార్థాలను స్థానికంగానే పండిస్తారు. ముఖ్యంగా ఆలివ్‌ల నుంచి తయారయ్యే ఆలివ్ ఆయిల్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడటంలో పాత్ర పోషించే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం: బోలోటానా ప్రజలు తమ బంధువులకు దగ్గరగా నివసిస్తుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలంగా ఉండటం, అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అక్కడి జీవనశైలిలో భాగంగా కనిపిస్తున్నాయి.

సామాజిక సంబంధాలు: ఒంటరితనం తక్కువగా ఉండటం, సమాజంలోని వ్యక్తుల మధ్య పరస్పర సహకారం ఉండటం కూడా దీర్ఘాయుష్షుకు దోహదపడవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడి ప్రజల మధ్య బలమైన అనుబంధాలు ఉన్నాయి. ఒకరినొకరు చూసుకుంటారు. ప్రయాణాలు, రోజువారీ పనుల్లో కార్ల కంటే నడకకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని పరిశోధకులు వివరించారు.

ఆహారం, శారీరక చురుకుదనం, కుటుంబ మద్దతు, సామాజిక సంబంధాలు, జన్యుపరమైన లక్షణాలు.. ఇవన్నీ కలిపి ప్రజల దీర్ఘాయుష్షుపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, వీటిలో ఏ అంశం ఎంత కీలకమో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.

బోలోటానాపై జరుగుతున్న పరిశోధనలు ప్రజలు ఎందుకు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. రోజువారీ అలవాట్లు, సామాజిక సంబంధాలు, పరిసర వాతావరణం.. వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం సహాయపడవచ్చు. అయితే, బోలోటానా ప్రజల జీవనశైలిని అనుసరించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ 100 ఏళ్లు జీవిస్తారని చెప్పలేము. దీర్ఘాయుష్షుపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.

ఇదీ చదవండి: బొమ్మ.. బాంబుగా మారింది..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement