మంకీపాక్స్‌ అలర్ట్‌.. WHO సీరియస్‌ వార్నింగ్‌

WHO Warns Monkeypox Spreads Risk To Public Health - Sakshi

జెనీవా: కరోనా కొత్త వేరియంట్లతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. ప్రపంచవ్యాప‍్తంగా మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. 

మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. 
తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది.

మరోవైపు.. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది. మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది. ఒకవేళ.. వైరస్ సమూహ వ్యాప్తి కనుక ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 

ఇదిలా ఉండగా.. మంకీ పాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్‌కు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలు. ఇక, అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్‌ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు, వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఐసొలేషన్‌లో ఉండి చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్సలు తీసుకోవాలి. ఈ వైరస్‌ ఇతరులకు సోకకుండా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇది కూడా చదవండి: ప్రజలకు మరో ముప్పు.. కొత్త వైరస్‌ కలకలం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top