
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్ మార్కెట్‌లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆరోపించింది. కరోనా మూలాలను అంచనా వేయడంలో ఈ సమాచారమే కీలకమని పేర్కొంది. కోవిడ్ పరిశోధనల ఫలితాలను అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటూ పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికింది.
మహమ్మారి పుట్టుకను అర్థం చేసుకోవడం నైతిక, శాస్త్రీయ అవసరమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెసియస్ అన్నారు. ‘‘వూహాన్‌లోని హునాన్ మార్కెట్‌లో సేకరించిన నమూనాల డేటాను ఈ ఏడాది జనవరి చివర్లో ఆన్‌లైన్ నుంచి తొలగించారు. దాన్ని తిరిగి అందరికీ అందుబాటులో ఉంచాలని చైనాకు చెప్పాం’’ అన్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో పుట్టిన కరోనా వైరస్ సార్స్–కోవ్–2 ప్రపంచమంతటా వ్యాపించి, లక్షలాది మరణాలకు కారణంగా మారడం తెలిసిందే.