PM Modi-PM Danish: డెన్మార్క్‌ పీఎంతో మోదీ చర్చలు

Watch: PM Modi Conversations With Danish PM At Copenhagen - Sakshi

ద్వైపాక్షిక బంధం బలోపేతానికి చర్యలు

కోపెన్‌హాగన్‌: డెన్మార్క్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్‌తో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సమావేశమై పలు విషయాలను చర్చించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మోదీకి డెన్మార్క్‌లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని ఫ్రెడెరిక్సన్‌ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తన అధికార నివాసానికి తోడ్కొని వెళ్లి, భారత పర్యటనలో ఆయన తనకిచ్చిన పెయింటింగ్‌ను చూపించారు. మోదీని మంచి స్నేహితుడిగా అభివర్ణించారు.  డెనార్క్‌లో పర్యటించిడం మోదీకి ఇదే తొలిసారి. బుధవారం కూడా ఆయన డెన్మార్క్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డెన్మార్క్‌ రాణి మార్గరెథే2తో సమావేశమవుతారు. అక్కడి భారతీయులతో కలిసి ఇండో డెన్మార్క్‌ రౌండ్‌టేబుల్‌ వ్యాపార సమావేశంలో పాల్గొంటారు. డెన్మార్క్‌లో 60కి పైగా భారత కంపెనీలున్నాయి. 16వేల దాకా ప్రవాస భారతీయులున్నారు.

ఇండో నార్డిక్‌ సమావేశం 
రెండో ఇండియా నార్డిక్‌ సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. నార్డిక్‌ దేశాలైన డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వే ప్రధానులు ఈ సమావేశానికి హాజరవుతారు. 2018లో జరిగిన తొలి ఇండో నార్డిక్‌ సదస్సు అనంతరం పురోగతిని సమీక్షిస్తారు. ఆర్థిక రికవరీ, శీతోష్ణస్థితి మార్పు, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధన వనరులు, అంతర్జాతీయ భద్రత, ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఇండో నార్డిక్‌ సహకారం తదితరాలపై సదస్సు దృష్టి పెడుతుందని మోదీ చెప్పారు. నార్డిక్‌ ప్రధానులతో మోదీ విడిగా కూడా చర్చిస్తారు. నార్డిక్‌ దేశాలు, భారత్‌ మధ్య 2020–21లో 500 కోట్ల డాలర్లకు పైగా వాణిజ్యం జరిగింది.  

యుద్ధం తక్షణం ఆగాలి: మోదీ
రష్యా, ఉక్రెయిన్‌ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని మోదీ పిలుపునిచ్చారు. వెంటనే చర్చలతో సంక్షోభానికి తెర దించాలన్నారు. రష్యాపై ప్రభావం చూపగల భారత్‌ యుద్ధాన్ని ఆపేందుకు డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడెరిక్సన్‌ ఆశాభావం వెలిబుచ్చారు.

భూమికి భారత్‌ హాని చేయదు! 
భారత్‌ పర్యావరణ విధ్వంసకారి కాదని మోదీ అన్నారు. భూ పరిరక్షణ యత్నాల్లో ముందంజలో ఉంటుందని చెప్పారు. భారత్‌లో పునర్వినియోగ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కాప్‌ 26 సదస్సుల్లో ఇచ్చిన వాగ్దానాలను వివరించారు. ‘‘2070 నాటికి కర్బన ఉద్గారరహిత దేశంగా రూపొందేందుకు ప్రయత్నిస్తున్నాం. 2030 నాటికి దేశ ఇంధనావసరాల్లో 40 శాతం పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు. ప్రతి ప్రవాస భారతీయుడూ కనీసం ఐదుగురు విదేశీ స్నేహితులు భారత్‌ను సందర్శించేలా ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడు దేశీయ టూరిజానికి పునర్వైభవం వస్తుందన్నారు.

వైవిధ్యమే భారత బలం
భారతీయ సమాజానికి సమ్మిళిత, సాంస్కృతిక వైవిధ్యమే బలాన్నిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ శక్తితోనే భారతీయులు ప్రతి క్షణం జీవిస్తారని, ఈ విలువలే భారతీయుల్లో వేలాది సంవత్సరాలుగా పెంపొందాయని ఆయన చెప్పారు. డెన్మార్క్‌లోని ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయులంతా దేశరక్షణలో భాగస్వాములు కావాలని, జాతి నిర్మాణంలో ప్రతిఒక్కరూ చేతులు కలపాలని ఆయన కోరారు. భారతీయుడు ఏదేశమేగినా ఆ దేశాభివృద్ధికి నిజాయతీగా పనిచేస్తాడన్నారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా పలుమార్లు ప్రాంగణమంతా మోదీ, మోదీ అని మారుమోగింది. తాను పలువురు ప్రపంచ నేతలను కలిసానని, వారంతా తమ దేశాల్లో భారతీయుల విజయాలను తనతో పంచుకునేవారని మోదీ చెప్పారు. ప్రవాస భారతీయుల జనాభా కొన్ని దేశాల మొత్తం జనాభా కన్నా అధికమని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలు సడలించిన అనంతరం డెన్మార్క్‌ ప్రధానినే తొలిసారి భారత్‌కు ఆహ్వానించామని గుర్తు చేశారు.   

చదవండి: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారుగా తరుణ్‌ కపూర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top