భారత్‌లో అవకాశాలు అపారం

PM Narendra Modi meets Norwegian counterpart in Denmark for bilateral talks - Sakshi

పెట్టుబడులతో రండి

నార్డిక్‌ దేశాల పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ ఆహ్వానం

నాలుగు దేశాల ప్రధానులతో భేటీ  

కోపెన్‌హగెన్‌/పారిస్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్‌ పర్యటన బుధవారం మూడోరోజుకు చేరుకుంది. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌లో నార్డిక్‌ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్‌ల్యాండ్‌ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్‌–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్‌ దేశాల పెట్టుబడిదారులను కోరారు. భారత కంపెనీలతో జట్టుకట్టాలన్నారు. ప్రధానంగా టెలికాం, డిజిటల్‌ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు.

నరేంద్ర మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్‌ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్‌ ఎనర్జీ, స్పేస్‌ హెల్త్‌కేర్‌ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్‌ చేశారు. భారత్‌ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్‌ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు. స్వీడన్‌ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్‌ ప్రధానమంత్రి కాట్రిన్‌ జాకబ్స్‌డాటిర్, ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రి సనా మారిన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు.

రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సు
కోపెన్‌హగెన్‌లో బుధవారం నిర్వహించిన రెండో ఇండియా–నార్డిక్‌ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఫిన్‌లాండ్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్‌ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్, రష్యాను కోరారు.

ప్రపంచంలో చాలాదేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ ప్రకారం నడుచుకోవడం లేదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం లేదని ప్రధానమంత్రులు ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధంగా రష్యా సేనలు సాగిస్తున్న దాడులను నిరసిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు. నిబంధనల ఆధారిత ఇంటర్నేషనల్‌ ఆర్డర్‌కు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్‌ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు.

పారిస్‌లో మాక్రాన్‌తో భేటీ   
ప్రధాని బుధవారం సాయంత్రం ఫ్రాన్స్‌ చేరుకున్నారు. పారిస్‌లో ల్యాండయ్యానంటూ ట్వీట్‌ చేశారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top