జెరూసలేంలో రణరంగం: 20 మంది మృతి

Violence Clashes At Al Aqsa Mosque In Jerusalem - Sakshi

అల్‌–అక్సా మసీదులో తీవ్ర ఘర్షణ 

305 మంది పాలస్తీనియన్లకు గాయాలు 

21 మంది పోలీసులు గాయపడ్డారని ఇజ్రాయిల్‌ ప్రకటన 

ఉత్తర గాజా స్ట్రిప్‌లో పేలుడు..9 మంది మృతి 

జెరూసలేం: పవిత్ర నగరం జెరూసలేంలోని అల్‌–అక్సా మసీదు ప్రాంగణంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇజ్రాయిల్‌ పోలీసులు, పాలస్తీనా పౌరులు పరస్పరం ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుతున్న పాలస్తీనావాసులను చెదరగొట్టేందుకు ఇజ్రాయిల్‌ పోలీసులు బాష్పవాయువు, రబ్బర్‌ బుల్లెట్లు, స్టన్‌ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో 305 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. వీరిలో 228 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మొత్తం 20 మంది ఘర్షణల్లో మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు. మరోవైపు 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయిల్‌ అధికారులు ప్రకటించారు. ఏడుగురు ఇజ్రాయిల్‌ పౌరులు కూడా గాయాలపాలైనట్లు తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పరమ పవిత్రమైన క్షేత్రాల్లో అల్‌–అక్సా మసీద్‌ కూడా ఒకటి. రంజాన్‌ మాసంలో ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు పెద్ద సంఖ్యలో పాలస్తీనావాసులు వస్తుంటారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయిల్‌ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.  తూర్పు జెరూసలేం శివారులోని షేక్‌ జెర్రాలో పాలస్తీనా ప్రజల నివాసాలను ఇజ్రాయెల్‌ సెటిలర్లు ఆక్రమించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.

ఆగ్రహంతో రగిలిపోతు న్న పాలస్తీనియన్లు సోమవారం ఉదయం ప్రార్థనల సందర్భంగా ఇజ్రాయిల్‌ పోలీసులపై విరుచుకుపడ్డారు. మసీదు బయట గస్తీ కాస్తున్న పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ప్రతిదాడికి దిగా రు. అల్‌–అక్సా ప్రాంగణం రణరంగాన్ని తలపిం చింది. పాలస్తీనా ప్రజల విషయంలో ఇజ్రాయిల్‌ తీరును అంతర్జాతీయ సమాజం తప్పుపడుతోంది. 

విమాన దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు 
అల్‌–అక్సా మసీదు కాంపౌండ్‌ నుంచి ఇజ్రాయిల్‌ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని గాజాలోని హమాస్‌ మిలిటెండ్‌ సంస్థ డిమాండ్‌ చేసింది. అనంతరం జెరూసలేంలో వైమానిక దాడుల సైరన్లు, పేలుళ్ల మోతలు వినిపించాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. 

ఉత్తర గాజా స్ట్రిప్‌లో పేలుడు 
భారీ పేలుడుతో సోమవారం ఉత్తర గాజా స్ట్రిప్‌ వణికిపోయింది. ఈ ఘటనలో 9మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నారని అధికారులు ప్రకటించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. గాజాలోని హమాస్‌ తీవ్రవాదులు ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా వైమానిక దాడులకు దిగామని ఇజ్రాయిల్‌ తెలిపింది.
చదవండి: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top