వెనెజువెలా.. టార్గెట్‌ ఆయిలా | Venezuela holds the worlds largest oil reserves | Sakshi
Sakshi News home page

వెనెజువెలా.. టార్గెట్‌ ఆయిలా

Jan 4 2026 1:00 AM | Updated on Jan 4 2026 1:00 AM

Venezuela holds the worlds largest oil reserves

ప్రపంచంలోనే అత్యధికంగా వెనెజువెలాలో చమురు నిల్వలు

వాటిని గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా ఆయిల్‌ మార్కెట్‌పై ఆధిపత్యానికి 

అమెరికా ప్రయత్నం అదే జరిగితే తగ్గనున్న ఒపెక్‌ దేశాల ప్రాబల్యం

రష్యా, చైనాకూ ప్రతికూలం

డ్రగ్స్‌ .. వలసలపై పోరు, దేశ భద్రతకు ముప్పు మొదలైన అంశాల వల్లే వెనెజువెలాపై దాడికి పాల్పడినట్లు అమెరికా చెబుతున్నప్పటికీ నిజంగా కారణాలు అవేనా? లేక వేరే ఏవైనా ఉన్నాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. వెనెజువెలాలో పుష్కలంగా ఉన్న చమురు నిల్వలే టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ పోరుకు తెరతీసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తద్వారా ప్రపంచ ముడిచమురు మార్కెట్లో ఒపెక్‌ (ఆయిల్‌ ఎగుమతి దేశాల) ఆధిపత్యానికి గండి కొట్టి, అమెరికా కొత్త ఆయిల్‌ కింగ్‌గా మారే ప్రయత్నం చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనెజువెలాపై అమెరికా దాడి దరిమిలా ప్రపంచ ముడిచమురు మార్కెట్‌లో చోటు చేసుకునేందుకు అవకాశమున్న పరిణామాలపై కథనం.     – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

అమెరికాకు ఎందుకు ఆసక్తి..
ప్రపంచంలోనే అమెరికా అత్యధికంగా రోజుకు 20–22 మిలియన్‌ బ్యారెళ్లు (ఎంఎంబీపీడీ) ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వెనెజువెలా తయారు చేసే రకం ఆయిల్‌ని కొంత దిగుమతి చేసుకుంటోంది. అమెరికా తయారు చేసే లైట్‌ స్వీట్‌ రకం ముడిచమురు.. పెట్రోల్‌లాంటి వాటి తయారీకి మాత్రమే ఉపయోగపడుతుంది. డీజిల్‌తో పాటు ఫ్యాక్టరీలు ఇతరత్రా అవసరాలకు కావాల్సిన ప్రొడక్టులను ఉత్పత్తి చేయాలంటే వెనెజువెలా సరఫరా చేసే హెవీ, సోర్‌ రకం క్రూడాయిల్‌ ముఖ్యం. పలు అమెరికన్‌ రిఫైనరీలు.. వెనెజువెలా హెవీ ఆయిల్‌ని ప్రాసెస్‌ చేయడానికి అనువుగా నిర్మితమై ఉన్నాయి.

తమ దేశపు ఆయిల్‌తో పోలిస్తే వెనెజువెలా ఆయిల్‌తోనే అవి సమర్ధవంతంగా పని చేయగలవు. దానికి తగ్గట్లుగానే మిగతా దేశాలతో పోలిస్తే సమీపంలోనే ఉన్న వెనెజువెలా నుంచి అమెరికా రోజుకు 1.02 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఈ దాడి వల్ల అగ్రరాజ్యానికి, దాని మిత్ర దేశాలకు, ముఖ్యంగా వెనెజువెలా ఎకానమీకి కూడా ప్రయోజనాలు చేకూరవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా తదితర దేశాలకు చెందిన ఆయిల్‌ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు పెరుగుతాయని, తద్వారా ఆ దేశంలో ఉత్పత్తి కూడా గణనీయంగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ధరలు అదుపులో ఉంటాయంటున్నారు.

అపార ఆయిల్‌.. ఖనిజ నిల్వలు
ప్రపంచంలోనే అత్యధికంగా వెనెజువెలాలో 303 బిలియన్‌ బ్యారెళ్లకు పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు నిక్షేపాల్లో ఇది అయిదో వంతు. అదే అమెరికా, రష్యాలో చెరి 80 బిలియన్‌ బ్యారెళ్లు ఉండగా.. సౌదీ అరేబియాలో 267 బిలియన్‌ బ్యారెళ్ల మేర నిక్షేపాలు ఉన్నాయి. అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేక వెనెజువెలా ఆయిల్‌ పరిశ్రమ అనేక సంవత్సరాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సరైన నాయకత్వం లేకపోవడం, అవినీతి, అమెరికా ఆంక్షలు, పరిశ్రమలోకి పెట్టుబడులు రాకపోవడం మొదలైనవి ఇందుకు కారణం.

ఫలితంగా, 25 ఏళ్ల క్రితం రోజుకు 3 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసిన వెనెజువెలా ప్రస్తుతం ఒక మిలియన్‌ బ్యారెళ్ల స్థాయికి పడిపోయింది. ఇలా ఉత్పత్తి చేసే ఆయిల్‌లో సింహభాగాన్ని (రోజుకు 6,00,000 బ్యారెళ్లు) చైనా దిగుమతి చేసుకుంటోంది. వెనెజువెలా ప్రభుత్వానికి రుణాలు ఇవ్వడం ద్వారా ఆ దేశపు ఆయిల్‌ రంగంలో చైనా గణనీయంగా ఇన్వెస్ట్‌ చేసింది. ఇక వెనెజువెలాలో ముడిచమురుతో పాటు అరుదైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజ సంపద విలువ దాదాపు 1.36 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా.

రష్యాకు చెక్‌..
రష్యా ఆయిల్‌ కూడా దాదాపు వెనెజువెలా క్రూడాయిల్‌ తరహాలోనే ఉంటుంది. అందుకే భారత్, చైనాలాంటి దేశాలు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వెనెజువెలాలో ఉత్పత్తి పెరిగితే అది రష్యాకి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. ఇప్పటిదాకా రష్యా దగ్గర కొంటున్న దేశాలు నెమ్మదిగా వెనెజువెలావైపు మళ్లుతాయి. ఫలితంగా రష్యా ఎకానమీ దెబ్బతింటుంది. అలాగే ఉక్రెయిన్‌ మీద యుద్ధం చేసే సామర్థ్యాలు కూడా సన్నగిల్లుతాయి. ఆ విధంగా రష్యాని అమెరికా కట్టడి చేసినట్లవుతుంది.

అదే సమయంలో అత్యధిక నిల్వలున్న వెనెజువెలాను గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ మార్కెట్‌పైనా ఆధిపత్యం దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో షెల్‌ ఆయిల్‌ ఉత్పత్తి బూమ్‌ వల్ల మార్కెట్‌ ఆధిపత్యం ఒపెక్‌ దేశాల నుంచి కొంత అమెరికాకు వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తిదారుగా అమెరికా మారింది. రాబోయే రోజుల్లో వెనెజువెలాలోని చమురు నిక్షేపాలు, అమెరికా, దాని మిత్ర దేశాల చేతిలోకి వెళ్తే.. అంతర్జాతీయంగా ఆయిల్‌ మార్కెట్‌ తీరుతెన్నులు మారిపోవచ్చు. భవిష్యత్తులో ఒపెక్, దాని మిత్ర దేశాల సామర్థ్యాలను బలహీనపర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మనపై ఎఫెక్ట్‌ ఏంటంటే..
భారత్‌కి కూడా వెనెజువెలా నుంచి రోజుకు సుమారు 60,000 నుంచి 1,00,000 బ్యారెళ్ల (బీపీడీ) మేర సరఫరా అవుతోంది. మనం క్రూడాయిల్‌ దిగుమతుల్లో ఇది సుమారు 2–3 శాతం ఉంటుంది. 2024లో వెనెజువెలా నుంచి 1.76 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకుంది. ఒకవేళ వెనెజువెలా ఆయిల్‌పై పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలైతే మధ్యప్రాచ్యదేశాల నుంచి ఖరీదైన ప్రత్యామ్నాయాలను కొనుగోలు చేయాల్సి రావచ్చు.

దీనితో సుమారు 10 బిలియన్‌ డాలర్ల వరకు దిగుమతుల బిల్లు భారం పెరగొచ్చని అంచనా. అటు వెనెజువెలా కోవకి చెందినది కాకపోయినప్పటికీ రష్యా నుంచి కూడా చమురు దిగుమతులను పెంచుకోవడం ద్వారా లోటును భర్తీ చేసుకునే వీలున్నా, ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ మనపై అమెరి కా ఒత్తిడి తెస్తున్న కారణంగా ఇలాంటి అవకాశాలపై కొంత సందేహాలు నెలకొన్నాయి.

తాత్కాలికంగా రేట్లకు రెక్కలు..
వెనెజువెలా సరఫరా చేసేది స్వల్పమే అయినా అది కూడా నిల్చిపోతే చమురు రేట్లు తాత్కాలికంగా, బ్యారెల్‌కి 3–5 డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మార్కెట్లో ఓవర్‌–సప్లై నెలకొనడంతో పాటు ఒపెక్‌ దేశాలు ఆ మేరకు అదనంగా ఉత్పత్తి పెంచితే ధరలు మళ్లీ సాధారణ స్థాయికి తిరిగి రావచ్చు. అయితే, వెనెజువెలా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌ రకం ప్రత్యేకమైనది కావడం వల్ల దానిపైనే ఆధారపడిన వర్గాలపై కొంత ప్రభావం పడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement