టెన్షన్‌ పడుతున్న ట్రంప్‌.. ఇవాంక హత్యకు మాస్టర్‌ ప్లాన్‌ | USA Ivanka Trump assassination attempt | Sakshi
Sakshi News home page

టెన్షన్‌ పడుతున్న ట్రంప్‌.. ఇవాంక హత్యకు మాస్టర్‌ ప్లాన్‌

May 23 2026 11:01 AM | Updated on May 23 2026 11:26 AM

USA Ivanka Trump assassination attempt

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హత్యకు ప్లాన్‌ జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీంతో, ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇరాన్‌ ఐఆర్‌జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే, అతడు తన ప్లాన్‌ అమలు చేసే లోపే అరెస్టు అయినట్టు తెలిసింది. దీంతో, ఇవాంక ట్రంప్‌నకు పెను ప్రమాదం తప్పందని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.

ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హత్యకు ప్లాన్‌ జరిగినట్టు అమెరికాకు చెందిన దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే, ఐఆర్‌జీసీతో సంబంధాలున్న మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ(32) కొంతకాలం క్రితం తుర్కియేలో అరెస్టు అయ్యాడు. అరెస్టు అనంతరం, అతడిని అమెరికాకు తరలించారు. ఈ క్రమంలో అతడిని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. మహమ్మద్ వద్ద ఇవాంక కుటుంబం నివసిస్తోన్న ఇంటి బ్లూప్రింట్‌ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ ప్లాన్‌ చేసినట్టు సదరు కథనంలో పేర్కొన్నారు. కానీ, అతడు ప్లాన్‌ అమలు చేసే లోపే అరెస్టు అయ్యాడని తెలియజేసింది. అతడు అరెస్ట్‌ కాకపోయి ఉంటే ప్రమాదం జరిగేదనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఖాసీం సులేమానీ ఇరాన్ మిలిటరీలో అగ్రశ్రేణి కమాండర్. ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కోర్‌ (ఐఆర్‌జీసీ) విభాగం ఖుద్ ఫోర్స్‌కు కమాండర్‌గా ఉన్న సమయంలో అమెరికా అతడిని హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహమ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్-ఇరాక్ ఉగ్రనెట్‌వర్క్‌లో అతడిది కీలకపాత్ర అని అమెరికా అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement