‘చైనాను ఎదుర్కోవటంలో అమెరికాకు భారత్‌ కీలకం’

US Navy Chief Says India Crucial For America To Counter China - Sakshi

వాషింగ్టన్‌: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్‌ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్‌ మైక్‌ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్‌పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.  

వాషింగ్టన్‌లో నిర్వహించిన ఓ సెమినార్‌లో ఈ మేరకు అమెరికా-భారత్‌ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్‌ అడ్మిరల్‌ మైక్‌ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్‌ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్‌లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్‌ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. 

ఇండో-యూఎస్‌ సైనిక విన్యాసాలు.. 
భారత్‌-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్‌ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్‌ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్నాయి.

ఇదీ చదవండి: తైవాన్‌ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top