
వాషింగ్టన్: అమెరికా వైమానిక దళం అత్యంత శక్తివంతమైన అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) మినట్‌మ్యాన్–3ని బుధవారం ప్రయోగించింది. దేశానికి క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించిన సమయంలో రీ–ఎంట్రీ వెహికల్ మాత్రమే అమర్చిన ఈ క్షిపణిలో ఎటువంటి ఆయుధాలు లేవని ఎయిర్‌ఫోర్స్ తెలిపింది.
రీ–ఎంట్రీ వెహికల్‌లో సాధారణంగా అణు వార్‌హెడ్‌ను ఉంచుతారు. గంటకు 15 వేల మైళ్లకంటే ఎక్కువ వేగంతో 4,200 మైళ్లు ప్రయాణించిన ఈ క్షిపణి మార్షల్ ఐల్యాండ్స్‌లోని యూఎస్ ఆర్మీ స్పేస్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ కమాండ్‌లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రాంతానికి చేరుకుంది. దేశ అణ్వాయుద సామర్థ్యాన్ని, సర్వసన్నద్ధతను చాటేందుకే ఈ పరీక్ష చేపట్టామని యూఎస్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కమాండర్ జనరల్ థామస్ బుస్సెయిర్ చెప్పారు. ఇది రొటీన్‌గా చేపట్టే పరీక్ష మాత్రమే తప్ప, ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్య కాదని యూఎస్ మిలటరీ స్పష్టం చేసింది.