క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్స్‌తో రూ.2.17 కోట్ల సంపాదన

US Man Earns More Than 2 Crore Rupees From Credit Card Reward Point - Sakshi

అమెరికాలో చోటు చేసుకున్న సంఘటన

రివార్డ్‌ పాయింట్స్‌నే సంపాదనగా మలుచుకుని కోట్లు సంపాదించిన వైనం

వాషింగ్టన్‌: మనలో చాలామందికి క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించే అలవాటు ఉంటుంది. క్యాష్‌బ్యాక్‌ వస్తుందని.. రివార్డ్‌ పాయింట్స్‌ కోసం క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించేవారు అధికం. రివార్డ్‌ పాయింట్స్‌ ద్వారా ఎవరికైనా మహా అయితే వేలల్లో డబ్బులు వస్తాయి.. కానీ కోట్లకు కోట్లు రావడం చాలా అరుదు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఈ అరుదైన సంఘటనను వాస్తవం చేశాడు. క్రెడిట్‌ కార్డ్‌ వినియోగాన్ని హాబీగా మొదలు పెట్టి.. దాన్నే వృత్తిగా మార్చుకుని ఏకంగా 2.17 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. విషయం కాస్త ఇన్‌కంటాక్స్‌ అధికారులకు తెలియడంతో వారు అతడికి నోటీసులు జారీ చేసి.. దర్యాప్తు చేయడంతో అతగాడి సంపాదన వివరాలు వెలుగులోకి వచ్చాయి. . ఆ వివరాలు...

అమెరికాకు చెందిన కాన్‌స్టాంటిన్‌ అంకీవ్‌ ఫిజిసిస్ట్‌గా పని చేస్తుండేవాడు. క్రెడిట్‌ కార్డ్‌ వినియోగంతో లభించే క్యాష్‌బ్యాక్‌, రివార్డ్‌ పాయింట్స్‌ అంటే అతడికి ఎంతో ఆసక్తి. ఈ క్రమంలో 2009 నుంచి క్రెడిట్‌ కార్డ్‌ వినియోగించడం ప్రారంభించాడు. మొదట సరదాగా మొదలుపెట్టిన హాబీ కాస్తా ఆ తర్వాత అతడి వృత్తిగా మారింది. దాంతో లక్షలు లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. 

ఎలా సంపాదించేవాడంటే..
కాన్‌స్టాంటిన్‌ తన క్రెడిట్ కార్డు నుంచి పెద్ద సంఖ్యలో గిఫ్ట్‌ కార్డులను కొని.. దాన్ని ఎన్‌కాష్‌ చేసుకునేవాడు.  అతను ఈ డబ్బును తిరిగి తన బ్యాంకు ఖాతాలో జమ చేసి, క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించేవాడు. అంటే గిఫ్ట్‌కార్డ్‌ మీద వచ్చిన ఆదాయమే అతడి సంపాదన అన్నమాట.

ఉదాహరణకు, కాన్‌స్టాంటిన్‌ 500 డాలర్ల గిఫ్ట్‌ కార్డు కొనుగోలు చేస్తే.. దాని మీద అతడికి 5 శాతం అనగా 25 డాలర్లు రివార్డ్‌గా పొందేవాడు. దీన్ని ఎన్‌కాష్‌ చేసుకోవాలంటే 6 డాలర్లు చెల్లించాలి. 25 నుంచి 6 డాలర్లు చెల్లిస్తే.. అతడి దగ్గర 19 డాలర్లు మిగిలిపోతాయి. ఇది అతడికి వచ్చే లాభం అవుతుంది. అలా వచ్చిన రివార్డుల ద్వారా అతడు 3 లక్షల డాలర్లుకు పైగా సంపాదించాడు. ఆ మొత్తం విలువ మన కరెన్సీలో 2.17 కోట్ల రూపాయలు. 

పనేం చేయకుండానే కాన్‌స్టాంటిన్‌ ఆదాయం పెరగడంతో కొందరు దీని గురించి ఇన్‌కంటాక్స్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు కాన్‌స్టాంటిన్‌కు నోటీసులు జారీ చేసి.. దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎంతైనా రివార్డ్‌ పాయింట్స్‌ ద్వారా ఇంత భారీ మొత్తం సంపాదించడం అంటే నిజంగానే గ్రేట్‌ అంటున్నారు ఈ వార్త తెలిసిన వారు. 

చదవండి: క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top