వలస విధానంపై ట్రంప్‌కి చుక్కెదురు

US court orders full reinstatement of DACA programme - Sakshi

అక్రమంగా వచ్చిన మైనర్లకు రక్షణ ఉండాలన్న ఫెడరల్‌ న్యాయమూర్తి

ఒబామా నాటి డీఏసీఏ విధానాన్ని కొనసాగించాలని ఆదేశం

వాషింగ్టన్‌: వలసదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా హయాం నాటి వలస విధానాలను పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్‌ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో భారత్‌ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చిన చిన్నారులకి రక్షణ కల్పించడానికి బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏసీఏ) విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్‌ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయత్నించింది. అయితే  ఆ ప్రయత్నాలకు అమెరికా కోర్టు అప్పట్లో అడ్డుకట్ట వేసింది.

మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్‌ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్‌ గరాఫీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీని ఆదేశించారు. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని స్పష్టం చేశారు.  2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్‌ ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ విధానం ద్వారా చిన్నతనంలోనే అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చిన వారికి రక్షణ కలగనుంది.

చిన్న వయసులో  తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వారికి రక్షణ కల్పించి, వారికి ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి నికోలస్‌  పేర్కొన్నారు. 2019 నాటి సౌత్‌ ఏసియన్‌ అమెరికన్స్‌ లీడింగ్‌ టుగెదర్‌ (సాల్ట్‌) నివేదిక ప్రకారం భారత్‌ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. 2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది. అదే సంవత్సరం భారత్‌ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top