ఖనిజ ఒప్పందం ఖరారు | US and Ukraine sign long-awaited natural resources deal | Sakshi
Sakshi News home page

ఖనిజ ఒప్పందం ఖరారు

May 2 2025 2:48 AM | Updated on May 2 2025 2:48 AM

US and Ukraine sign long-awaited natural resources deal

పత్రాలు చూపిస్తున్న అమెరికా ట్రెజరీ కార్యదర్శి బీసెంట్, ఉక్రెయిన్‌ ఆర్థిక మంత్రి సిర్దెంకో

సంతకాలు చేసిన ఉక్రెయిన్‌–అమెరికా

తవ్వకం, ఆదాయంలో ఇరు దేశాలకు సమాన వాటా

పదేళ్ల పాటు అమల్లో ఉండనున్న ఒప్పందం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పనీ చేశారు. ఉక్రెయిన్‌లోని అపారమైన అరుదైన ఖనిజ సంపదపై కన్నేసిన ఆయన దాన్ని చేజిక్కించుకోవడంలో అడుగు ముందుకేశారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతి ఇస్తేనే రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ముగించడానికి, శాంతిని నెలకొల్పడానికి సహకరిస్తానంటూ మెలికపెట్టి ఉక్రెయిన్‌ను దారికి తెచ్చుకున్నారు. ట్రంప్‌ ఒత్తిడికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తలొగ్గక తప్పలేదు. ఖనిజాలను సొంతం చేసుకోవడానికి ట్రంప్‌కు అనుమతి ఇచ్చేశారు.

ఈ మేరకు ఉక్రెయిన్‌–అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సంతకాలు జరిగాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బీసెంట్, ఉక్రెయిన్‌ ఆర్థిక మంత్రి యూలియా సిర్దెంకో సంతకాలు చేశారు. ఉక్రెయిన్‌ భూభాగంలోని గ్రాఫైట్, టైటానియం, అల్యూమినియం వంటి 20కిపైగా ముడి ఖనిజాలు ఇక అమెరికా పరం కానున్నాయి. అలాగే ఖనిజేతర వనరులైన ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్‌కు సైతం అనుమతి లభించింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తివివరాలను ఇరు దేశాలు ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాయి.

ఈ కొత్త ఒప్పందాన్ని ‘యూఎస్‌–ఉక్రెయిన్‌ రీఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌’ అని పిలుస్తున్నారు. ఖనిజాలు తవ్వుకోడానికి అనుమతులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్‌ పునర్నిర్మాణ నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ నిధికి ఉక్రెయిన్‌–అమెరికా సమానంగా డబ్బులు సమకూర్చాల్సి ఉంటుంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరగాల్సి ఉండగా అనూహ్యంగా ఆగిపోయింది. అప్పట్లో వైట్‌హౌస్‌లో ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మీడియా సమక్షంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. అప్పటి నుంచి జరిగిన ప్రయత్నాలు ఫలించి, ఒప్పందం కుదిరింది. అమెరికాతో ఈ ఒప్పందం పదేళ్లపాటు అమల్లో ఉంటుందని ఉక్రెయిన్‌ ప్రధానమంత్రి డెనిస్‌ షిమీహల్‌ చెప్పారు. ఖనిజాల తవ్వకం, ఆదాయంలో ఇరు దేశాలకు సమాన వాటా  లభిస్తుందన్నారు. 

మూర్ఖుడిగా ఉండదల్చుకోలేదు: ట్రంప్‌ 
ఉక్రెయిన్‌కు తాము ఇప్పటిదాకా ఇచ్చిన దానికంటే అధికంగా తిరిగి పొందబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందలేని మూర్ఖుడిగా తాను ఉండదల్చుకోలేదని అన్నారు. ఒకచోట డబ్బు ఖర్చు పెట్టినప్పుడు లాభపడాల్సిందేనని పరోక్షంగా తేల్సిచెప్పారు. మరోవైపు ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ ప్రభుత్వం స్వాగతించింది. ఇది సమానమైన, గొప్ప అంతర్జాతీయ ఒప్పందమని అభివర్ణించింది. భవిష్యత్తులో అమెరికా నుంచి సైనిక సాయం పొందడానికి ఇది కీలకంగా మారుతుందని ఆకాంక్షించింది. అమెరికాతో బంధం బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అమెరికాతో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నామని, తమ దేశంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ నిధి దోహదపడుతుందని వెల్లడించింది. 

కీలకాంశాలు.. 
ఉక్రెయిన్‌–అమెరికా ఖనిజ ఒప్పందంలో కొన్ని కీలకాంశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చామని, ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని ట్రంప్‌ గతంలో డిమాండ్‌ చేశారు. కొత్త ఒప్పందం ప్రకారం.. ఆ డబ్బును ఉక్రెయిన్‌ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. రష్యా పట్ల ఇన్నాళ్లూ సానుకూలంగా మాట్లాడిన అమెరికా స్వరంలో మార్పు వచ్చింది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచబోతోంది.

 రష్యాకు సహకరించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా సంకేతాలిచ్చింది. ఖనిజాలను తవ్వుకొనే అవకాశం అమెరికాకు ఇచ్చినప్పటికీ వాటిపై యాజమాన్య హక్కులు ఉక్రెయిన్‌కే దఖలు పరిచారు. యూ రోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో చేరాలన్న ఉక్రె యిన్‌ ఆకాంక్షను అమెరికా ఇకపై అడ్డుకోదు. ఈయూతోపాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం స్వీకరించడానికి అమెరికా సహకరిస్తుంది. అమెరికా నుంచి సైనిక సాయం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ఉక్రెయిన్‌ భద్రతకు అమెరికా పూర్తి గ్యారంటీ ఇవ్వలేదు.  

 ఆ ఖనిజాలకు ఎందుకంత ప్రాముఖ్యం?
ఇతర దేశాల్లో లేని ఆరుదైన ఖనిజ నిల్వలకు ఉక్రెయిన్‌ కేంద్రంగా మారింది. లిథియం, గ్రాఫైట్, మాంగనీస్, టైటానియం వంటివి నిక్షిప్తమ య్యాయి. 34 కీలక ఖనిజాల్లో 23 రకాల ఖనిజాలు ఇక్కడ ఉన్నాయి. ఇది ఉక్రెయిన్‌ను ప్రపంచంలోనే విలువైన ఖనిజ వనరులు కలిగిన దేశంగా నిలబెట్టింది. ఆధునిక కాలానికి అవవసరమైన ఎలక్ట్రిక్‌ వాహనాలు, విండ్‌ టర్బైన్‌లు, సౌర ఫలకాలు, శక్తి నిల్వ వ్యవస్థలతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఆయుధాల తయారీకి అవసరమైన లిథియం, కోబాల్ట్‌ వంటివి ఉక్రెయిన్‌లో పుష్కలంగా ఉన్నా యి.

ఇక ముడి ఇనుము, టైటానియం, మాంగనీస్, యురేనియం, నియోడిమియం, డిస్ప్రోసి యం, నియోబియం, టాంటాలమ్,  బెరీలియం, కోబాల్ట్, మాంగనీస్, జిర్కోనియం వంటి ఖనిజా లకు లోటులేదు. ఈ ఖనిజాల కోసం అమెరికా ప్రధానంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ఉక్రెయిన్‌లోని ఖనిజ వనరులను దక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రపంచంలోని మొత్తం ఖనిజ వనరుల్లో 5 శాతానికిపైగా ఉక్రెయిన్‌లోనే ఉండడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement