Global Warming: మానవాళికి డేంజర్‌ బెల్స్‌

UN scientists warn of worsening global warming - Sakshi

ప్రమాదపు అంచున పర్యావరణం

ఉష్ణోగ్రతలు తగ్గించకుంటే భారీ మూల్యం

హెచ్చరించిన ఐరాస నివేదిక

ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు గతంలో అనుకున్న ప్రమాద స్థాయిలను మించి పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ పరిస్థితి చేయిదాటిపోతోందని, ‘కోడ్‌ రెడ్‌ ఫర్‌ హ్యుమానిటీ’ పేరిట ఐరాస విడుదల చేసిన నివేదిక రూపకర్త లిండా మెర్న్స్‌ చెప్పారు. ఈ ఉత్పాతం నుంచి తప్పుకునే అవకాశం లేదని హెచ్చరించారు. ఐరాసకు చెందిన ఐపీసీసీ(ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) ఈ నివేదికను విడుదల చేస్తుంది.

ప్రపంచ పర్యావరణంలో సంభవిస్తున్న ఈ శీతోష్ణస్థితి మార్పు  మానవ తప్పిదాల వల్ల జరుగుతోందనేందుకు సందేహమే లేదని ఐపీసీసీ తెలిపింది. 21వ శతాబ్దంలో ఇంతవరకు ఐపీసీసీ ఇలాంటి సీరియస్‌ అంచనాలను వెలువరించలేదు. రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుందన్నారు. 2015 ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉన్నాయి. అంటే ప్రపంచం ముప్పునకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది.  

ఐదు మార్గాలు
ప్రపంచ కర్బన ఉద్గారాలను కట్టడి చేసే విధానాన్ని బట్టి ఐదు రకాల భవిష్యత్‌ అంచనాలను నివేదిక ప్రస్తావించింది. 1. ఊహించనంత వేగంగా, భారీగా దేశాలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం. 2. తీవ్రమైన కాలుష్య నివారణ చర్యలుంటాయి కానీ భారీగా ఉండవు. 3. ఒక మోస్తరుగా ఉద్గారాల నియంత్రణ చేపట్టడం. 4. ప్రస్తుతమున్న స్వల్పకాలిక ప్రణాళికలను కొనసాగించడం. 5. కర్బన ఉద్గారాలు మరింతగా పెరగడం.. అనే ఐదు రకాల అంచనాలున్నాయని, ఇప్పటివరకు ప్రపంచం ఐదో మార్గంలో పయనిస్తూ వచ్చిందని, ఇటీవల కాలంలో మూడు, నాలుగు మార్గాలకు మధ్యస్థంగా ఉంటోందని నివేదిక వివరించింది.  పైన చెప్పిన ఐదు మార్గాల్లో దేనిలోనైనా సరే 2030నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ టార్గెట్‌ను దాటటం ఖాయమని నివేదిక హెచ్చరించింది.

3,4 మార్గాలను అనుసరిస్తే ప్రపంచ ఉష్ణోగ్రత అంచనాలను దాటి 2 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతుందని, ఐదవ మార్గం కొనసాగితే 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత అంచనా కన్నా 3.3 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా పెరుగుతుందని తెలిపింది. కానీ దేశాల దృక్పథంలో వస్తున్న మార్పు వల్ల ఇంత ప్రమాదం జరగకపోవచ్చని నివేదిక అంచనా వేసింది. టిప్పింగ్‌ పాయింట్లుగా పిలిచే భారీ విధ్వంసాలైన మంచు చరియలు కరిగిపోవడం, సముద్ర ప్రవాహాల్లో అనూహ్య మందగమనం వంటివి జరిగేందుకు అవకాశాలు తక్కువే కానీ, అసలు జరగవని కొట్టిపారేయలేమని హెచ్చరించింది. అందరూ భయపడే అట్లాంటిక్‌ సముద్ర ప్రవాహాల మందగమనం ఈ శతాబ్దంలో ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే ఏమాత్రం పరిస్థితిని అశ్రద్ధ చేయకుండా అందరూ కర్బన ఉద్గారాల కట్టడికి, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. 

దేశాల స్పందన: నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదిక చర్చకు రానుంది. ఉద్గారాల తగ్గింపు విషయంలో తక్షణ చర్యల అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పిందని పలువురు ప్రపంచ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక గట్టి హెచ్చరికగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ అభివరి్ణంచారు. మానవాళికి ఇది కోడ్‌ రెడ్‌ నివేదికని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ నేతలు ఇప్పటికైనా కనీసం ప్యారిస్‌ ఒప్పందాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గుటెరెస్‌ విజ్ఞప్తి చేశారు. నేతలంతా ఈ విషయంలో తప్పక చర్యలు తీసుకోవాలని స్కాటాండ్‌లో జరగబోయే సదస్సుకు అధ్యక్షత వహించనున్న అలోక్‌ శర్మ విజ్ఞప్తి చేశారు. మానవ జనిత కార్బన్‌డైఆక్సైడ్‌ను  నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వందకు పైగా దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.

వేడి పెరిగితే కీడే
 భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి వాయువులు ప్రచండంగా వీయడం, కరువు ఏర్పడడం, అనూహ్య వరదలు సంభవిస్తాయని నివేదిక పేర్కొంది. ఇటీవల కాలంలో శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులు చాలా వేగంగా, తీవ్రంగా, వెయ్యేళ్లలో లేనట్లుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలు నిదర్శనాలను కళ్లముందుంచింది.  

► పరిస్థితి విషమిస్తోందనేందుకు సముద్ర మట్టాలు పెరగడం, ఆర్కిటిక్‌ సముద్రంలో మంచు కరుగుదల స్పీడందుకోవడం, తుఫా నులు తీవ్రంగా మారడం వంటివి సంకేతాలు.  

► గతంలో 50 సంవత్సరాలకు ఒకమారు వచ్చే తీవ్ర వడగాలులు ఇప్పుడు పదేళ్లకు ఒకసారి ప్రత్యక్షమవడం శీతోష్ణస్థితిలో ప్రచండ మార్పునకు నిదర్శనం. ప్రపంచ ఉష్ణోగ్రత మరో డిగ్రీ పెరిగితే ఈ గాలులు ప్రతి ఏడేళ్లకు రెండుమార్లు ప్రత్యక్షమవుతాయి.  

► ఉష్ణోగ్రతల పెరుగుదలతో కేవలం అనూహ్య శీతోష్ణ మార్పులు కనిపించడమేకాకుండా ఒకేమారు పలు ఉత్పాతాలు సంభవించే అవకాశాలుంటాయి. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు పశ్చిమ యూఎస్‌లో జరుగుతున్నాయి(ఒకేమారు వడగాలులు, కరువు, కార్చిచ్చు ప్రత్యక్షం కావడం).

► గ్రీసు, టరీ్కల్లో తాజా కార్చిచ్చుకు సైతం ఈ ఉష్ణోగ్రతల మార్పు కారణమే.  

► పరిస్థితి విషమించే కొద్దీ సముద్రాల్లో ఆక్సిజన్‌ శాతం తగ్గి అవి ఆమ్లయుతాలుగా మారతాయి, ఇదే జరిగితే కొన్ని వేలసంవత్సరాల పాటు అవి మామూలు స్థితికి చేరలేవు.  

► కార్బన్‌డైఆక్సైడ్, మిథేన్‌ వాయు ఉద్గారాలే ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణాలు. శిలాజ ఇంధనాల వాడకం, జీవుల్లో జరిగే జీవక్రియల ద్వారా ఈ రెండూ ఉత్పత్తి అవుతుంటాయి.

సైంటిస్టులు ఈ పరిణామాలపై 30 ఏళ్లుగా హెచ్చరిస్తున్నా, ఎవరూ పట్టించుకోలేదని నివేదిక వాపోయింది. రాబోయే దశాబ్దాల్లో జరగనున్న ఉత్పాతాన్ని తట్టుకునేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని ఐపీసీసీ తెలిసింది. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలను తగ్గించలేకున్నా, ఇకపై మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఇందుకోసం గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను అదుపు చేయాలని, ముఖ్యంగా కార్బన్‌డైఆక్సైడ్‌ ఉద్గారాన్ని తగ్గించడం ద్వారా ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top