
కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధనలో వెల్లడి
కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. దాంతో కరువు కాటకాలు తప్పడం లేదు. కరువుల బెడద మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా గత 40 ఏళ్లలో కరువుల తీవ్రత ఏకంగా 40 శాతం పెరిగినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనలు తేలింది. వర్షపాతం స్థిరంగా ఉన్నచోట కూడా కరువుల తీవ్ర పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది.
వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ అది తేమను ఒడిసిపట్టుకొనే సామర్థ్యం సైతం పెరుగుతోంది. దాంతో కరువులు తీవ్రత సైతం పైపైకి ఎగబాకుతోందని సైంటిస్టులు వెల్లడించారు. వాతావరణం వేడెక్కడానికి, కరువులు తీవ్రంగా మారడానికి మధ్య దగ్గర సంబంధం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన క్లైమేట్ హజార్డ్స్ సెంరట్ డైరెక్టర్ క్రిస్ ఫాంక్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.
రాబోయే రోజుల్లో ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు మరింత పెరగడమే తప్ప తగ్గిపోయే సూచనలైతే కనిపించడం లేదు. దీన్నిబట్టి చూస్తే మరింత తీవ్రమైన కరువులకు మానవాళి సిద్ధపడక తప్పదని చెప్పొచ్చు. ఈ అధ్యయనం కోసం 1901 నుంచి 2022 వరకు వాతావరణ డేటాను సేకరించి, విశ్లేíÙంచారు. అట్మాస్ఫియరిక్ ఎవాపరేటివ్ డిమాండ్(ఏఈడీ) పెరుగుతుండడంతో కరువుల తీవ్రత కూడా పెరుగుతున్నట్లు తేలింది. గత 40 ఏళ్లలో ఇది 40 శాతం పెరిగినట్లు స్పష్టమయ్యింది.
ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగినా సరే అక్కడి వాతావరణం తేమను అధికంగా పీల్చుకుంటుంది. పంటలు, చిత్తడి నేలలు, అడవుల నుంచి తేమ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఫలితంగా నేల నిస్సారమైపోతోంది. పంటలు ఎండిపోతాయి. చిత్తడి నేలలు పొడి నేలలుగా మారిపోతాయి. మరో విషయం ఏమిటంటే.. 1981–2017 నాటి సగటుతో పోలిస్తే గత ఐదేళ్లలో కరువు పరిస్థితి 74 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు 58 శాతం ఏఈడీనే కారణం. 2022లో భూగోళంపై రికార్డు స్థాయిలో 30 శాతం భూభాగం కరువునకు గురయ్యింది. దీనికి 40 శాతం ఏఈడీనే కావడం గమనార్హం.
– న్యూఢిల్లీ