సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నారు: యూఎన్‌

UN Reports Sharp Increase In Cyber Crime During Covid 19 Pandemic - Sakshi

న్యూయార్క్‌: మహమ్మారి కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫిషింగ్‌ వెబ్‌సైట్ల(నకిలీ)లో 350 శాతం మేర పెరుగుదల నమోదైందని తెలిపింది. ఆస్పత్రులు, వైద్యారోగ్య రంగాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడులు పెచ్చుమీరుతున్నాయని.. కరోనా సమాచారాన్ని ఎరగా చూపి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపింది. అదే విధంగా గత కొంతకాలంగా ఉగ్రవాదులు కూడా చాపకింద నీరులా తమ కార్యకలాపాలు విస్తృతం చేశారని పేర్కొంది.(ఒక్క రోజే 2 వేలకు పైగా మరణాలు)

ఇంటర్నెట్‌ వేదికగా రాడికల్‌ గ్రూపులను ప్రేరేపిస్తూ.. ఉగ్ర సంస్థల్లో కొత్తగా నియామకాలు చేపడుతున్నారని తెలిపింది. ప్రపంచ దేశాలు కరోనా కట్టడిపై దృష్టి సారించిన వేళ.. ప్రపంచ శాంతి, భద్రతలపై వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే ఓ అంచనాకు వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కాబట్టి కరోనాపై పోరు కొనసాగిస్తూనే ఉగ్రవాదులతో పాటు సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించేలా ప్రణాళికలు రచించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. 

నిధులు సమకూర్చుకుని
ఈ మేరకు ఐరాస ఉగ్రవాద నిరోధక విభాగం చీఫ్‌ వ్లాదిమిర్‌ వొరొంకోవ్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. 134 దేశాల ప్రతినిధులు, 88 సివిల్‌ సొసైటీలు, వివిధ ప్రైవేటు సంస్థలు, 47 అంతర్జాతీయ సంస్థలు, 40 యూఎన్‌ విభాగాలతో వారం రోజుల పాటు నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్‌ సహా సహజ వనరులు, పురాతన వస్తువుల అక్రమ రవాణా, కిడ్నాప్‌లు, హేయమైన నేరాలు, దోపిడీల ద్వారా ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. (వ్యాక్సిన్‌ని సిద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్‌)

అదే విధంగా కొన్ని చోట్ల పాలనా రంగంలో ప్రభుత్వ వైఫల్యాలను టెర్రరిస్టులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా కాలంలో వైరస్‌తో పాటు ఉగ్రవాదం, తీవ్రవాదం కూడా తీవ్ర స్థాయికి చేరిందని.. మహమ్మారిపై పోరాడుతూనే ఇతర విషయాలపై కూడా దృష్టి సారించాలని ప్రపంచ దేశాలను కోరారు. ఇక ఈ విషయం గురించి వియన్నా కేంద్రంగా పనిచేసే డ్రగ్స్‌, క్రైం విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఘడా వాలే మాట్లాడుతూ.. గతంలో కంటే మిన్నగా పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు సాగాలని కోరారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top