ఉక్రెయిన్‌లో భారతీయులకు చేదు అనుభవం.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్‌

Ukrainian Train Guards Kicking Indian Students At Kharkiv - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులు ఉక్రెయిన్‌కు వీడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాల రద్దు కారణంగా భారత్‌ సహా ఇతర దేశాల విద్యార్థులు ఉక్రెయిన్‌ను దాటేందుకు రైలు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎంతో కష్టంతో రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత వారికి చేదు అనుభవమే మిగులుతోంది. 

అయితే,  ఖార్కీవ్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తక్షణం ఖార్కీవ్‌ను విడాలని ఇండియన్‌ ఎంబసీ తాజా అడ్వైజరీ మేరకు వందల సంఖ్యలో భారత విద్యార్థులు రైల్వేస్టేషన్‌కు చేరుకొన్నారు. అనంతరం వారు రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా ఉక్రెయిన్‌ ట్రైన్‌ గార్డులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రైళ్లలో ఎక్కిన భారతీయులను దింపివేయడంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, రైలులోకి కేవలం ఉక్రెయిన్‌ పౌరుల కోసం మాత్రమే డోర్లు తెరుస్తున్నట్టు విద్యార్థులు చెప్పారు. ఇదిలా ఉండగా గార్డులు భారత విద్యార్థులను అడ్డుకోవడమే కాకుండా వారిని కొడుతూ, కాళ్లతో తన్నినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారిని భయపెట్టేందకు తుపాకులతో గాలిలోకి కాల్పుల కూడా జరిపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉక్రెయిన్‌ గార్డుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు భారత్‌కు చెందిన 600 విద్యార్థులు ఈశాన్య ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దులోని సుమీ యూనివర్సిటీలో చిక్కుకున్నారు. వీరిని తరలించేందుకు ఎంబీసీ ప్రయత్నం చేయలేదని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భారత జాతీయ జెండాను చూపించి టర్కీ, పాకిస్తాన్‌ దేశాల విద్యార్థులు సరిహద్దులకు చేరుకుంటున్నట్టు భారత విద్యార్థులు పేర్కొంటున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top