
కీవ్: తుర్కియే చర్చల సమయంలో కుదిరిన అంగీకారం మేరకు ఉక్రెయిన్, రష్యా యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ మొదలైంది. ఉక్రెయిన్–బెలారస్ సరిహద్దుల్లో శుక్రవారం చెరో 390 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించుకున్నాయి. 2022లో రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఈ స్థాయిలో యుద్ధ ఖైదీల మార్పిడి జరగడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ అప్పగించిన తమ 390 మంది సైనికులు, పౌరులను వెంటనే బెలారస్‌కు వైద్య పరీక్షల నిమిత్తం పంపించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. రష్యా సైతం తమ 390 మంది సైనికులను అప్పగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.
మొత్తం వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకునేందుకు 16న తుర్కియేలో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఇందులో మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, ఈ వారాంతంలో మరికొందరిని ఇచ్చిపుచ్చుకునే అవకాశాలున్నాయని జెలెన్‌స్కీ వివరించారు. కాగా, తదుపరి చర్చల విషయంలో ఎలాంటి అంగీకారం కుదరలేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. ఖైదీల మార్పిడి పూర్తయ్యాక దీర్ఘకాల, సమగ్ర శాంతి ఒప్పందం కోసం రూపొందించిన షరతుల ముసాయిదాను ఉక్రెయిన్‌కు అందజేస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు.
కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా
యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుండగానే రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సైరన్ మోతలు, పేలుళ్ల శబ్ధాలతో కీవ్ వాసులు బాంబు షెల్టర్లలో రాత్రంగా గడిపారు. రష్యా ప్రయోగించిన 14 క్షిపణులు, 250 షహీద్ డ్రోన్లనకు గాను 6 క్షిపణులను, 245 డ్రోన్లను కూల్చామని కీవ్ యంత్రాంగం తెలిపింది.
రాజధాని ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో ఇందుకు సంబంధించిన ఘటనల్లో 15 మంది వరకు గాయపడ్డారని పేర్కొంది. రాజధానిపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని వెల్లడించింది. పలు నివాస భవనాలు, అపార్టుమెంట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మంటలు చెలరేగాయని వివరించింది. మే 20–23వ తేదీల మధ్య ఉక్రెయిన్ తమ దేశంపైకి ప్రయోగించిన 788 డ్రోన్లను కూల్చి వేసినట్లు రష్యా తెలపగా, గురువారం రాత్రి సైతం రష్యా తమపైకి 175 షహీద్ డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది.