Covid Virus: 411రోజులపాటు కోవిడ్‌తో అల్లాడిన రోగి.. ఎట్టకేలకు విముక్తి

UK Researchers Cure Man Who Had Covid For 411 Days - Sakshi

కోవిడ్‌.. రెండేళ్లుగా ప్రజలను అల్లాడిచ్చిన ఈ మహమ్మారి ప్రస్తుతం పత్తాలేకుండా పోయింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓరియంట్‌ వేరియంట్లతో యావత్‌ ప్రపంచాన్ని తన గుప్పట్లో పెట్టుకున్న వైరస్‌ ప్రభావం ఇప్పుడు తగ్గిపోయింది. జనాలు కూడా కరోనాను పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. కోవిడ్‌ నిబంధనలేవి పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సాధారణంగా కోవిడ్‌ బారిన పడితే 10 లేదా 20 మహా అయితే నెలలో కోలుకుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి సంవత్సరానికి మించి మహమ్మారితో పోరాడుతూనే ఉన్నాడు. ఏకంగా 411 రోజులుగా అతన్ని కరోనా విడిచిపెట్టడం లేదు. 

దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్‌ నుంచి బయటపడ్డాడు. నిర్ధిష్ట వైరస్‌ జన్యు కోడ్‌ను విశ్లేషించి సరైన చికిత్సను అందిచడంతో కోలుకున్నాడని బ్రిటీష్‌ పరిశోదకులు తెలిపారు. గైస్ &సెయింట్ థామస్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, కింగ్స్ కాలేజ్ లండన్‌లోని పరిశోధకుల బృందం క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో 13 నెలలపాటు కరోనా సోకిన 59 ఏళ్ల వ్యక్తికి చేసిన చికిత్స గురించి వివరించారు.
చదవండి: విచిత్ర ఆలోచన.. తనను తానే షేర్లుగా అమ్మేసుకున్నాడు

మూత్రపిండం మార్పిడి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి 2020 డిసెంబరులో కోవిడ్ సోకిందని.. ఈ ఏడాది జనవరి వరకు పాజిటివ్ గానే కొనసాగిందనిప పేర్కొన్నారు. దీర్ఘకాల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు నానోపోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీతో వేగవంతమైన జన్యు విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో రోగికి బీ.1 వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. కాసిరివిమాబ్‌, ఇమ్‌డెవిమాబ్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ద్వారా చికిత్స చేసినట్లు పరిశోధకులు తెలిపారు.

సదరు వ్యక్తి కోవిడ్‌ ఫస్ట్‌వేవ్‌లోనే కరోనాకు గురవ్వడంతో ఈ చికిత్స ద్వారా నయం చేశామని. ఇది ఓమిక్రాన్‌ వంటి వేరియంట్‌పై సమర్థంగా పనిచేయదని పేర్కొన్నారు. ఇలా మొత్తానికి కరోనా ఫస్ట్‌ వేవ్‌ నుంచి వైరస్‌తో పోరాడుతున్న రోగిని విజయవంతంగా దాని నుంచి విముక్తి కలిగించారు.

సాధారణ వైరస్‌ కాదు
అయితే అతనికి సోకింది పెర్సిస్టెంట్‌ కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌. ఇది నార్మల్‌ కోవిడ్‌ కంటే భిన్నమైంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో తక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇది సోకిన వారు నెలలు ఒక్కోసారి సంవత్సరాలు కూడా ‍కరోనా పాటిజివ్‌గా వస్తుందని సెయింట్‌ థామస్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్టుకు చెందిన అంటువ్యాధుల ప్రత్యేక వైద్యుడు ల్యూక్‌ స్నెల్‌ తెలిపారు.  అంటువ్యాధుల తీవ్ర ముప్పు వల్ల సగం మంది రోగుల్లో ఊపిరితిత్తుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top