
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. అమెరికా అధ్యక్షుడిగా కేవలం ఏడు నెలల కాలంలో ఏడు యుద్ధాలు ఆపాను. అందుకే తన పరిపాలన స్వర్ణయుగం అంటూ అభివర్ణించారు.
అమెరికా న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 80వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ‘ఇజ్రాయెల్ -ఇరాన్, భారత్-పాకిస్థాన్, రువాండా - డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్-కంబోడియా, అర్మేనియా -అజర్‌బైజాన్, ఈజిప్ట్ - ఇథియోపియా, సెర్బియా -కొసావో దేశాల మధ్య అంతులేని యుద్ధాల్ని ముగించా.
కొన్ని యుద్ధాలు 31 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మరికొన్ని 36ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అలాంటి అంతులేని యుద్ధాల్లో నేను ఏడు యుద్ధాలు ఆపాను. మరే ఇతర అధ్యక్షుడు వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ నేను వాటిని ఆపాను. భారత్-పాక్ యుద్ధాన్ని కూడా నేనే ఆపా. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నా. ప్రజల ప్రాణాలు కాపాడటమే నాకు అసలైన నోబెల్ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిపై విమర్శలు గుప్పించారు. యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది. ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయింది. దేశాల మధ్య యుద్ధ సమస్యల్ని పరిష్కరించేలా సహాయం చేసేందుకు ప్రయత్నించలేదు. ఐక్యరాజ్యసమితి తన సామర్ధ్యాన్ని కోల్పోయింది. ఐక్యరాజ్య సమితివన్నీ ఒట్టి మాటలే. ఆ ఒట్టి మాటలు యుద్ధాల్ని ఆపలేవు’ అని ట్రంప్ అన్నారు.