ట్రంప్‌ ప్లాన్‌ బీ.. ఉక్కిరి బిక్కిరి నడుమే ఇరాన్‌ కౌంటర్‌ | Trump Plan B, Iran Strong Counter Latest News | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ప్లాన్‌ బీ.. ఉక్కిరి బిక్కిరి నడుమే ఇరాన్‌ కౌంటర్‌

Apr 22 2026 11:49 AM | Updated on Apr 22 2026 12:07 PM

Trump Plan B, Iran Strong Counter Latest News

పశ్చిమాసియా యుద్ధంలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కాల పరిమితిని లేకుండా యుద్ధ విరమణను పొడిగించారు. అయితే ఇరాన్‌ దీని వెనక పెద్ద కుట్రే దాగి ఉందని అంటోంది. ఈ క్రమంలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ యుద్ధంతో ఇరాన్‌ ఆర్థికంగా బాగా దెబ్బ తిందని ట్రంప్‌ అంటున్నారు. ‘‘ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నౌకాదళ నిర్బంధం కారణంగానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. సైన్యానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడుతోంది.  సైన్యంతో పాటు పోలీసులకు జీతాలు అందడం లేదు. నగదు కోసం ఇరాన్‌ ఆకలితో ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేయబడటం వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. దానిని తిరిగి తెరవాలని తహతహలాడుతోంది’’ అని ట్రూత్‌ సోషల్‌  ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఇరాన్‌ తొలి నుంచి హర్ముజ్‌ మూసివేతకే మొగ్గుచూపుతూ వస్తోంది. కానీ ట్రంప్‌ మాత్రం ఇరాన్‌ దానిని తెరవాలని కోరుకుంటోందని అంటున్నారు. ‘‘ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్లు సంపాదించేది. ఇప్పుడు అదే మొత్తాన్ని కోల్పోతోంది. కాబట్టి తెరవాలనే చూస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొంటున్న మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌ ఇప్పటికే సంకేతాలు పంపిందని.. కానీ, తగిన రాజకీయ రాయితీలు లేకుండా జలసంధి తెరిస్తే చర్చల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారాయన. 

ట్రంప్‌ వాదనలో నిజం లేదా?
ఇరాన్‌ సైన్యం పూర్తిగా ధ్వంసమైందని అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్‌ ప్రకటించారు. అలాగే.. యుద్ధంతో సైన్య వ్యవస్థ ఘోరంగా దెబ్బ తిందని ట్రంప్‌ అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. అమెరికా పెంటగాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం తాజా అంచనాల ప్రకారం.. ఇరాన్‌ ఇంకా తన ప్రధాన సైనిక సామర్థ్యాలను కొనసాగిస్తోంది. అలాగే ఎన్‌బీసీ నివేదిక ప్రకారం, ఇరాన్‌ సైన్యం ఇంకా ప్రాంతీయ శక్తిగా కొనసాగుతోందని తెలుస్తోంది. 

ప్లాన్‌ బీ ఇదే.. 
ప్రాంతీయ మిత్రపక్షాల సహకారంతో ఇరాన్‌ యుద్ధంలో బలంగానే కనిపిస్తున్నా.. ఆర్థికంగా మాత్రం బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చర్చల కోసం ఇరాన్‌ మెడలు వంచాలని అమెరికా అడుగులేస్తోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇరాక్‌కు డాలర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ చర్య ద్వారా ఇరాన్‌ మద్దతు పొందిన మిలీషియాలను బలహీనపరచడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో.. 

ఇరాన్‌ సముద్ర వాణిజ్యాన్ని అడ్డుకోవడం.. వారి ప్రధాన ఆదాయ వనరులను కత్తిరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. చమురు  ఎగుమతులే ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు. అయితే ప్రస్తుతం అక్కడి పోర్టులపై అమెరికా నిర్బంధం కొనసాగుతోంది. దీనివల్ల చమురు బయటకు వెళ్లడం లేదు. ఈ ప్రభావంతో ఖార్గ్‌ దీవి (ఇరాన్‌ చమురు ఎగుమతుల 90% నిర్వహించే కేంద్రం) నిల్వలు నిండిపోయి ఉన్నాయి. కొత్తగా చమురు తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో చమురు బావులను తాత్కాలికంగా మూసేసే పరిస్థితికి దారి తీసింది. ఇది.. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ అంటున్నారు. 

ఇరాన్‌ కౌంటర్‌
సీజ్‌ ఫైర్‌ పొడిగింపు.. అమెరికా ఏకపక్ష నిర్ణయంగానే కనిపిస్తోంది. పాకిస్తాన్‌ నాయకత్వం అభ్యర్థన మేరకు దాడుల్ని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై ఇరాన్‌ కౌంటర్‌ వేసింది. ‘‘ సీజ్‌ ఫైర్‌ వంకతో ఈ గ్యాప్‌లో అమెరికా మళ్లీ దాడులు చేయాలని చూస్తోంది. అయినా ఓడిపోయేవాళ్లు నిబంధనలు పెట్టడం ఏంటి?’’ అంటూ ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌, ఆ దేశ చర్చల ప్రతినిధి మహ్మద్ బాగేర్ ఖలీబాఫ్‌ ఓ ట్వీట్‌ చేశారు.  

కాల్పుల విరమణ పొడిగింపు కేవలం వ్యూహాత్మక ప్రయోజనం కోసమే. నౌకాదళ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. పోర్టులకు వచ్చే నౌకలను ఆపడం కాల్పుల ఉల్లంఘన కాదా?. ఇది యుద్ధ చర్య కాకుండా మరేమిటి?. ఇలాంటి బెదిరింపుల మధ్య మేం చర్చలు జరపం అంటూ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. 

ఇరాన్‌ చర్చలకు దూరంగా ఉండటం.. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇస్లామాబాద్‌ పర్యటనను రద్దు చేసుకోవడం.. ఈ రెండు పరిణామాలు కలిపి శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement