‘నువ్వు నమ్మక ద్రోహివి.. నీకసలు తెలివే లేదు’ | Trump Loses Temper on NBCs Meet the Press interview | Sakshi
Sakshi News home page

‘నువ్వు నమ్మక ద్రోహివి.. నీకసలు తెలివే లేదు’

Jun 8 2026 9:21 AM | Updated on Jun 8 2026 11:41 AM

Trump Loses Temper on NBCs Meet the Press interview

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టీవీ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయారు. సదరు టీవీ ఛానెల్‌ యాంకర్‌పై నోరు పారేశుకున్నారు. ‘నువ్వు చేసేది మోసమైనా ఉండాలి. లేదంటే తెలివి తక్కువైనా ఉండాలి అంటూ కాలర్‌ మైక్‌ను పడేసి బయటకు వెళ్లిపోయారు.

ఆదివారం ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ఎన్‌బీసీ తన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్‌, యాంకర్‌ క్రిస్టెన్ వెల్కర్‌ల మధ్య చిన్న సైజు మినీ యుద్ధమే జరిగింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాలిఫోర్నియాలో జోబైడెన్‌ సుమారు 63శాతం ఓట్లు సాధించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ 34శాతం ఓట్లు మాత్రమే పొందారు. ఈ ఎన్నికల ఫలితాల సరళిని ఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్‌ మళ్లీ ప్రస్తావించారు. ఆయన కాలిఫోర్నియాలో రిగ్గింగ్‌ కారణంగా ఓట్ల లెక్కింపు ఆలసమైందని ఆరోపించారు. 

దీనికి యాంకర్‌ క్రిస్టెన్ వెల్కర్ స్పందిస్తూ.. ‘కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఆలస్యానికి కారణం రిగ్గింగ్‌ కాదు. పోలైన ఓట్ల శాతం ఎక్కువ. వాటిని లెక్కించడానికి మరింత సమయం పట్టింది’ అని చెప్పారు. ఈ వివరణతో ట్రంప్‌ చిర్రెత్తుకొచ్చి ‘కౌంటింగ్‌లో చీటింగ్‌ జరిగింది’ అని మరోసారి   ఆరోపించారు. వెల్కర్‌ ఆయనను నిలదీస్తూ.. మీ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ట్రంప్‌ ‘నేనే చూశాను.. అదే ఆధారం’ అని సమాధానమిచ్చారు. కానీ ఎన్‌బీసీ యాంకర్‌ ఎన్నికల్లో అవకతవకలకు ఎలాంటి ఆధారాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.

తర్వాత సంభాషణ మీడియాపై విమర్శలకు దారి తీసింది. ట్రంప్‌ కాలిఫోర్నియా ఎన్నికల అధికారులను, మీడియా ప్రతినిధులను, మీడియా సంస్థలను ‘మోసగాళ్లు’గా అభివర్ణించారు. మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమాన్ని కూడా ‘మోసపూరితం’ అని అన్నారు. ట్రంప్ అమెరికా ఎన్నికల నిర్వహణను ‘అభివృద్ధి చెందని దేశం’ తరహాలో ఉందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా వెల్కర్ ‘నేను మోసపూరితమైనది కాదు’ అని బదులిచ్చారు. దానికి ట్రంప్‌ ‘నువ్వు మోసపూరితమైనదానివైనా అయి ఉండాలి.. లేదంటే  తెలివితక్కువదానివైనా అయి ఉండాలి అని అన్నారు. కాలిఫోర్నియా ఎన్నికలపై జరిగిన చర్చ చివరికి రసాభాసగా ముగింది.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement