వివాదంలో ట్రంప్ విహారం

Trump Leaves Hospital, Waves At Supporter - Sakshi

విమర్శలకు తావిచ్చిన  ట్రంప్ సర్‌ప్రైజ్‌ ఔటింగ్ 

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన చర్యతో వివాదంలో ఇరుక్కున్నారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకి, ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  ట్రంప్ ఆసుపత్రి వెలుపలకు వచ్చి మరీ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ విమర్శల పాలయ్యారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే, నిబంధనలు ఉల్లంఘించి బయటతిరగడాన్ని వైద్య నిపుణులు సైతం తప్పుబడుతున్నారు. అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం, ఆందోళనల నేపథ్యంలో ట్రంప్ వైద్య బృందంలోని కీలక సభ్యుడు, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పల్మనరీ నిపుణుడు బ్రియాన్ గారిబాల్డి ప్రకారం సోమవారం ఆయన ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ  అంచనాల మధ్య  ట్రంప్ సర్‌ప్రైజ్‌  ఔటింగ్ విమర్శలకు తావిచ్చింది. 

కోవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన ట్రంప్ బులెట్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కలియ దిరుగుతూ, అభివాదం చేస్తూ తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. అనంతరం కొద్దిసేపటికి ఆసుపత్రికి తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించి ఉన్నప్పటికీ ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించ బయటికి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  మరోవైపు  కరోనా గురించి చాలా తెలుసుకున్నాను. నిజంగా స్కూలుకు వెళ్లినట్టుగా ఉందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన అభిమానులకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించడానికే బయటికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి  వైద్య సిబ్బందికి, నర్సులకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. 

అటు ట్రంప్ కాన్వాయ్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ కు పంపనున్నామని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ చీఫ్ జేమ్స్ ఫిలిప్స్ వ్యాఖ్యానించారు. వారు వైరస్ బారిన పడే అవకాశం ఉంది. చనిపోవచ్చు కూడా అంటూ  ట్రంప్ వైఖరిపై మండిపడ్డారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి జూడ్ డీర్ మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ట్రంప్ తో పాటు ఉన్న వారంతా ప్రొటెక్టివ్ గేర్ ను ధరించే ఉన్నారని, మెడికల్ టీమ్ ఈ పర్యటన సురక్షితమని చెప్పిన తరువాతనే ఆయన బయటకు వచ్చారని ప్రకటించడం విశేషం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top