మాతాజీ మృతి: వెండి తాగితే కరోనా తగ్గుతుందని..

Spiritual Leaders Mummified Remains Colorado Home - Sakshi

కొలరాడోలో వెలుగు చూసిన సంఘటన

వాషింగ్టన్‌: కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి రకరకాల సలహాలు, సూచనలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆవు మూత్రం వంటివి తాగితే కరోనా తగ్గుతుందని విపరీతంగా ప్రచారం జరిగింది. జనాలు కూడా బాగానే ఎగబడ్డారు. అయితే ఇలాంటి సంఘటనలు మన దగ్గరే కాదు విదేశాల్లో కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ మాతాజీ కరిగించిన వెండి తాగితే కరోనా తగ్గుతుందని భావించి.. ఆ ప్రయత్నం చేసి.. ప్రాణాలు విడిచింది. మరో వింత విషయం ఏంటంటే.. ఆమెకు అంత్యక్రియలు జరపకుండా ఓ వస్త్రంలో చుట్టి.. లైట్స్‌తో అలకరించి పూజిస్తున్నారు ఆమె శిష్యులు.

ఇది కాస్త పోలీసులకు తెలియడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి.. శిష్యులను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన కొలరాడోలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. అమి కార్లసన్‌(45) అనే మహిళ ‘‘లవ్‌ హాస్‌ ఓన్‌’’ అనే ఆధ్యాత్మిక సంస్థను నిర్వహిస్తుంది. శిష్యులు అందరూ ఆమెను ‘‘మదర్‌ ఆఫ్‌ గాడ్‌’’ అని పిలుస్తారు. ఈ క్రమంలో ఆమె చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్లసన్‌ ఇంటికి చేరుకుని అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఇంటిలో దాదాపు 10 మంది వరకు ఉన్నారు. ఇక కార్లసన్‌ మృతదేహాన్ని ఓ వస్త్రంలో చుట్టి.. బాక్స్‌లో పెట్టి.. విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆమెను గురించి పాటలు పాడుతూ కూర్చున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కార్లసన్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

కార్లసన్‌ ఈ ఏడాది మార్చిలోనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ద్రవ రూపంలో ఉన్న వెండిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఆమె  మరణించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇక కార్లసన్‌ 2018లో ‘‘లవ్‌ హాస్‌ ఓన్‌’’ అనే సంస్థను స్థాపించారు. దాదాపు లక్షన్నర మంది ఆమెకు శిష్యులుగా మారారు. వీరంతా కార్లసన్‌ దాదాపు 19 బిలియన్ ఏళ్లుగా మానవత్వాన్ని కాపాడటం కోసం శ్రమిస్తుందని.. ఏదో ఒక రోజు ఆమె తన శిష్యులను కొత్త లోకానికి తీసుకెళ్తుందని నమ్ముతారు. పైగా పూర్వజన్మలో డొనాల్డ్‌ ట్రంప్‌ కార్లసన్‌ తండ్రి అని ఆమె శిష్యులు నమ్ముతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top