
పూర్తి వివరాలు సేకరించండి
అటార్నీ జనరల్ పామ్ బాండీకి ట్రంప్ ఆదేశం
వాషింగ్టన్: రాజకీయ నాయకులకు వ్యభిచారిణులను ఎరగా వేసి, సొంత పనులు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో పూర్తి నిజాలు బయటకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తాజాగా ఓ రిపోర్ట్ ప్రచురించింది. 2003లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు పంపించిన బర్త్‌డే లేఖలో ట్రంప్ పేరు, సంతకం ఉన్నట్లు ఆ పత్రిక బయటపెట్టింది.
అభ్యంతకర రీతిలో ఉన్న ఓ మహిళ శరీర భాగాలు, దానిపై ట్రంప్ సంతకం ఇందులో కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. అది నకిలీ లేఖ అని తేల్చిచెప్పారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌ను, పాత్రికేయుడు రూపర్డ్ మర్దోక్‌ను కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.
డెమొక్రటిక్ పార్టీ సృష్టిస్తున్న ఈ కుంభకోణానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎప్‌స్టీన్ అంశంలో పూర్తి వివరాలు సేకరించాలని, నిజాలు నిగ్గుతేల్చాలని తమ అటార్నీ జనరల్ పామ్ బాండీని ఆదేశించారు. కోర్టు ఆమోదం మేరకు సమాచారం బహిర్గతం చేయాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ట్రంప్ ఆదేశాలపై దీనిపై పామ్ బాండీ ప్రతిస్పందించారు. కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎప్‌స్టీన్‌పై ఇప్పటిదాకా రహస్యంగా సాగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ప్రయతి్నస్తానని స్పష్టంచేశారు.