ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలన్నింటిపైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. ఇదే తుది నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు.
ట్రేడింగ్ ఎకనమిక్ డాటా బేస్ ప్రకారం.. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్‌లు ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. పొరుగున ఉండడంతో పాటు చమురు నేపథ్యంలో ఇవి భారీగా వాణిజ్యం చేస్తున్నాయి. అలాగే.. భారత్, రష్యా, ఈయూలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఇక భారత్ కూడా ఇరాన్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామే. 2025లో ఇరాన్ ఎగుమతుల్లో సుమారు 7% (5.1 బిలియన్ డాలర్లు) భారతదేశానికి వచ్చాయి. దీంతో భారత్ కూడా మూల్యం చెల్లించుకోవాలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.
ఇరాన్‌పై ఇప్పటికే..
అణ్వాయుధాల నేపథ్యంతో ఇరాన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పరిమితం చేయడం, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ సహా ఇతర ప్రధాన బ్యాంకులపై ఆంక్షలు విధించడం.. తద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు అవాంతరాలను కల్పించడం.. అలాగే.. ఇరాన్ షిప్పింగ్ కంపెనీలు, పోర్టులు, ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలను అమలు చేస్తోంది. అలాగే.. ఇరాన్ మిలిటరీ, డ్రోన్, మిసైల్ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సంస్థలపై నిషేధాలు విధించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సభ్యులు, ఆ దేశం తరఫున మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వ్యక్తులకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేయడం, వాళ్లు అగ్రరాజ్యానికి రాకుండా నిషేధం విధించడం లాంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఆర్థికంగా మరింత దెబ్బ తీయడానికే.. వాణిజ్య దేశాలపై సుంకాలను విధించినట్లు స్పష్టమవుతోంది.
చల్లారని జ్వాలలు
ఆర్థిక సంక్షోభం, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమైన సంగతి తెలిసిందే. అయితే వాటిని అణచివేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం అంతే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో.. వందల మంది మరణించగా(646 మంది అని తాజా సమాచారం).. వేల మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. ఉరి తీతలకు కూడా సిద్ధమైంది. అయితే ఈ అణచివేతను చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ అంటున్నారు.
చర్చలంటూనే..
ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే పబ్లిక్‌గా ట్రంప్ కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇరాన్‌ను వేరే రీతిలో డీల్ చేస్తన్నారని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెబుతున్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపే అంశం కూడా అమెరికా పరిశీలనలో ఉంది. కానీ, అదే సమయంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారామె. ఈ తరుణంలో ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్ బాంబ్ పేల్చడం గమనార్హం.


