Titanic tourist sub missing: What happend in Atlantic - Sakshi
Sakshi News home page

సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు.. టైటాన్‌ ప్రమాదంలో అసలు జరిగింది ఇదే!

Published Fri, Jun 23 2023 8:01 AM

Titanic tourist submersible missing: What happend in Atlantic - Sakshi

ఎప్పుడో వందేళ్ల కిందట.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. టైటాన్‌ అనే మినీ సబ్‌మెరిన్‌(సబ్‌ మెర్సిబుల్‌)లో వీక్షణకు బయల్దేరి.. సముద్ర గర్భంలోనే కలిపిపోయారు వాళ్లు!. దాదాపు ఐదురోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చింది. అమెరికా తీర రక్షణ దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీంలు సెర్చ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గురువారం నాడు గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారం.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది.  

యూఎస్‌ కోస్ట్ గార్డ్ ప్రకటన ప్రకారం..  టైటానిక్ శకలాల సమీపంలోనే ఓడ ముందుభాగం నుంచి సుమారు 1,600 అడుగుల దూరంలో టైటాన్‌ శిథిలాలు పడి ఉన్నాయి. రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికిల్‌(ROV) వీటిని గురువారం ఉదయం గుర్తించినట్లు ప్రకటించింది కోస్ట్‌గార్డ్‌. 

భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి ఐదుగురితో కూడిన ‘టైటాన్‌’ సాహసయాత్ర ప్రారంభం అయ్యింది. పోలార్‌ ప్రిన్స్‌ అనే నౌక సాయంతో టైటాన్‌ను నీటి అడుగుకు పంపించారు. గంటన్నర తర్వాత.. పోలార్‌ప్రిన్స్‌తో టైటాన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని వెంటనే  అమెరికా తీర రక్షణ దళం దృష్టికి తీసుకెళ్లింది ఈ యాత్ర నిర్వాహణ సంస్థ ఓషన్‌గేట్‌. న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్‌లో టైటాన్‌ అదృశ్యమై ఉంటుందని భావించింది కోస్ట్‌గార్డ్‌.  అప్పటి నుంచి 13,000 అడుగుల (4,000 మీటర్లు) లోతుల్లో టైటాన్‌ జాడ కనిపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. సముద్ర అగాథంలోకి చేరుకుని జలాంతర్గామిని కనిపెట్టడం అత్యంత కష్టమని నిపుణులు మొదటి నుంచి వేసిన అంచనా కొంతవరకు నిజమైంది కూడా. 

ఇలా జరిగిందేమో.. 
విపత్తు పేలుడు..Catastrophic Implosion టైటాన్‌ ప్రమాదానికి కారణం ఇదేనని యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ ఓ అంచనా వేస్తోంది. నీటి అడుగుకు వెళ్లే క్రమంలో.. ఛాంబర్‌లోని ఒత్తిడి వల్లే మినీసబ్‌మెర్సిబుల్‌ పేలిపోయి ఉంటుందని ప్రకటించింది. అయితే..

నీటి అడుగున సబ్‌మెర్సిబుల్‌(మినీజలంతర్గామి) విషయంలోనే కాదు.. సబ్‌మెరిన్‌ల(జలంతర్గాముల) విషయంలోనూ ఇది జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్‌మెరిన్‌లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయట. ఒక్కోసారైతే ఆ ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్‌ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్‌ శకలాల చెంత మృతదేహాల జాడ కనిపించినా.. అట్లాంటిక్‌ అడుగున ఉన్న వాతావరణం నుంచి బయటకు తేలేని పరిస్థితి ఉందని యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ అధికారికంగా ప్రకటించింది. 


ఆది నుంచి విమర్శలే..
వాషింగ్టన్‌ ఎవరెట్టెకు చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఓషన్‌గేట్‌. 2009లో స్టాక్‌టన్‌ రష్‌, గుయిలెర్మో సోహ్నలెయిన్‌లు దీనిని స్థాపించారు.  నీటి అడుగున టూరిజంతో పాటు అన్వేషణలకు, పరిశోధనలు ఈ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అందుకుగానూ ఛార్జి చేస్తుంటుంది.  2021 నుంచి టైటానిక్‌ శకలాలను చూసేందుకు టైటాన్‌ అనే సబ్‌ మెర్సిబుల్‌ ద్వారా యాత్రికులను తీసుకెళ్తూ వస్తోంది. ఈ అడ్వెంచర్‌ టూర్‌లో 400 మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. టైటాన్‌లో.. ముగ్గురు ప్రయాణికులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. వాళ్లకు తగ్గట్లే సీటింగ్‌ ఉంటుంది. దాదాపు 6.5 మీటర్ల పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల దాకా బరువు ఉంటుంది. కార్బన్‌, టైటానియం కలయిక గోడలు ఉన్నాయి.

సోనార్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌, హైఎండ్‌ కెమెరా ఎక్విప్‌మెంట్‌, పవర్‌ఫుల్‌ ఎల్‌ఈడీ లైట్లు.. వీటితో పాటు లోపలికి ప్రవేశించడానికి, బయటకు రావడానికి ఒక్కటే ద్వారం ఉంటుంది.  ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. తాజాగా వెళ్లిన ఐదుగురికి(ఒక పైలట్‌, మిగిలిన నలుగురు యాత్రికులు) 2.50 లక్షల డాలర్లు చెల్లించారు. మన కరెన్సీ లెక్కలో.. అది రూ.2 కోట్లకు పైమాటే. అయితే టైటాన్‌ నిర్మాణం అట్లాంటిక్‌ అగాధంలోకి వెళ్లడానికి పనికిరాదంటూ మొదటి నుంచి కొందరు నిపుణులు మొత్తుకుంటున్నా.. ఓషన్‌గేట్‌ మాత్రం యాత్రలు నిర్వహిస్తూనే వస్తోంది.  

అంతేకాదు దానిని ఆపరేట్‌ చేసేందుకు ఉపయోగించే రిమోట్‌ విషయంలోనూ తీవ్ర విమర్శలు.. మరోవైపు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌ అయ్యాయి. టైటానిక్‌ శకలాలకు చూసేందుకు గతంలో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ప్రయత్నించి భంగపడ్డాయి. అయితే చాలామంది నిపుణులు ఈ యాత్రను ఆత్మహత్య సదృశ్యంగా వర్ణించారు కూడా.

ఇదీ చదవండి: టిక్‌.. టిక్‌.. టిక్‌.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా టైటాన్‌ కోసం..

డబ్బే కాదు.. గుండెధైర్యం ఉన్నోళ్లు కూడా!

‘టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌’ మొత్తం ఐదుగురు టైటానిక్‌ శకలాలను చూసేందుకు వెళ్లారు. సాధారణంగా ఇలాంటి యాత్రలకు ఎంపిక ప్రక్రియ కూడా పకడ్బందీగానే జరుగుతుంది. అయితే ఈసారి యాత్రలో వెళ్లిన వాళ్లంతా.. గతంలో సాహస యాత్రలు చేసిన అనుభవం ఉన్నవాళ్లూ ఉన్నారు.  కానీ, ఈసారి సాహసయాత్ర వాళ్లను ప్రాణాలను బలిగొంది.

డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ హార్డింగ్‌..  బ్రిటన్‌కు చెందిన 58ఏళ్ల బిలియనీర్‌ హమీష్‌ హార్డింగ్‌ ప్రస్తుతం యూఏఈలో ఉంటున్నారు. దుబాయ్‌కు చెందిన యాక్షన్‌ ఏవియేషన్స్‌ కంపెనీ చైర్మన్‌గా వ్యహరిస్తున్నారు. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ సంస్థ అందిస్తోంది. ఆయన మూడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కూడా సాధించారు. అతను ఒక సాహసికుడు. 2022లో జెఫ్‌ బెజోస్‌ నిర్వహించిన బ్లూ ఆరిజిన్‌ వ్యోమనౌకలో  అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అనేకసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా సందర్శించారు. మహాసాగరంలో అత్యంత లోతైన ‘మరియానా ట్రెంచ్‌’లో ఎక్కువసేపు గడిపారు. ఈయన ఆస్తి సుమారు ఒక బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. నమీబియా నుంచి భారత్‌కు 8 చీతాలను తెప్పించే కసరత్తులో ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేశారు.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్‌, అతడి కుమారుడు సులేమాన్‌లు. బ్రిటిష్‌-పాకిస్థానీ బిలియనీర్‌ షాజాదా దావూద్‌(48), ఆయన కుమారుడు సులేమాన్‌(19) కూడా మినీ జలాంతర్గామిలో ఉన్నారు. షాజాదా.. కరాచీ కేంద్రంగా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్‌ ఛైర్మన్‌. ఇంగ్రో సంస్థ శక్తి, వ్యవసాయం, పెట్రోకెమికల్స్ టెలికమ్యూనికేషన్స్‌లో భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. 2022లో ఈ సంస్థ 350 బిలియన్ రూపాయల ($1.2 బిలియన్) ఆదాయాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో షాజాదా తండ్రి హుస్సేన్ దావూద్ పేరు ప్రతిసారీ ఉంటుంది. సర్రేలో భార్యా, ఓ కూతురు, కొడుకుతో ఆయన సెటిల్‌ అయ్యారు. దావూద్‌కు యూకేలోని ఉన్నతవర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పలు సాహస యాత్రల్లో పాల్గొన్నారు కూడా. 


ఓషియన్‌ గేట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టాక్టన్‌ రష్‌
..
ఓషన్‌గేట్‌ సహవ్యవస్థాపకుడు. ట్రైనింగ్‌ పైలట్‌ అయిన రష్‌.. గతంలో టైటానిక్‌ శకలాలను చూసి వచ్చారు కూడా. నిపుణుడి హోదాలో ఆయన ఆ బృందం వెంట వెళ్లారు. 


ఫ్రెంచ్ సబ్‌మెర్సిబుల్ పైలట్‌  పాల్‌ హెన్రీ నార్జిలెట్‌
..
నౌకాదళంలో కమాండర్‌గా పని చేసిన అనుభవం ఉంది ఈయనకి. అ‍త్యంత లోతైన ప్రదేశాల్లో పని చేసే టీంలకు ఈయన కెప్టెన్‌గా వ్యవహరించారు.  నావికుడిగా పాతికేళ్ల అనుభవమూ ఉంది. ది ఫ్రెంచ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ ఆఫ్‌ సీలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ పర్యటనలకు వెళ్లారాయన. 

విలాసవంతమైన టైటానిక్‌ నౌక.. 1912 ఏప్రిల్‌ 14న అట్లాంటిక్‌ మహాముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను 3,800 మీటర్ల లోతులోని సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. 

ఇదీ చదవండి: వేల అడుగుల లోతుల్లో టైటానిక్‌.. మీరూ చూసేయండి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement