లాహోర్‌కు పోలీసులు.. ఈలోపే విద్వేష ప్రసంగం కేసులో ఖాన్‌కు తాత్కాలిక ఊరట

Temporarily Relief For Imran Khan Over Hate Speech - Sakshi

ఇస్లామాబాద్‌: పాక్‌ మాజీ ప్రధాని, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా విద్వేషపూరిత ప్రసంగం కేసులో  క్వెట్టా స్థానిక కోర్టు ఒకటి ఆయన మీద అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయగా.. దానిని రెండు వారాల పాటు నిలిపివేయాలంటూ బెలూచిస్తాన్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. 

విద్వేషపూరిత ప్రసంగం కేసుకు గానూ సదరు స్థానిక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ క్రమంలో.. క్వెట్టా పోలీసుల బృందం ఒకటి ఖాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు లాహోర్‌కు కూడా చేరుకుంది. అయితే ఈలోపే బెలూచిస్తాన్‌ హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట ఇవ్వడం విశేషం. 

ఇదిలా ఉంటే.. గత ఆదివారం లాహోర్‌లోని ఆయన నివాసం జమాన్‌ పార్క్‌ వద్ద భారీ హైడ్రామా నడిచింది. తోషాఖానా కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయన్ని అరెస్ట్‌ చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో.. పోలీసులు అక్కడి చేరుకున్నారు. అయితే పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలోనే పీటీఐ కార్యకర్తలను, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖాన్‌.. పాక్‌ సర్కార్‌ను, దర్యాప్తు సంస్థలను, పోలీసులను తీవ్రంగా విమర్శించారు. 

ప్రభుత్వ సంస్థలను విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేసినందుకుగానూ బిజిల్‌ ఘర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఖాన్‌పై ఓ కేసు నమోదు అయ్యింది. దీంతో క్వెట్టా స్థానిక కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆ వెంటనే ఖాన్‌ బెలూచిస్తాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్‌ ‍ప్రసంగించిన చోటుకి.. బిజిల్‌ఘర్‌ స్టేషన్‌ పరిధికి సంబంధం లేదంటూ ఖాన్‌ తరపు న్యాయవాది వాదించగా.. కోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లోకల్‌ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను రెండు వారాలపాటు సస్పెండ్‌ చేస్తూ(విచారణ రెండు వారాలు వాయిదా వేసింది).. బెలూచిస్తాన్‌ ఎస్పీకి, బిజిల్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు సమన్లు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ వ్యాప్తంగా ఇప్పటివరకు 37 కేసులు నమోదు అయ్యియి. వీటిల్లో నేరుగా ఆయన పేరును నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top