తల్లీబిడ్డల మిస్సింగ్‌.. పెరుగుతున్న అనుమానాలు!

Suspects Rises In South Africa Tembisa Mother Twin Babies Birth - Sakshi

దక్షిణాఫ్రికాలో ఒకే కాన్పులో పది మంది బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిందన్న ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పుట్టిన బిడ్డలతో సహా ఆ తల్లి ఫొటోలను ఇంతవరకు బయటకు రిలీజ్‌ చేయకపోగా, ఆ తల్లీబిడ్డల ఆచూకీని ఇప్పటికీ గోప్యంగా ఉంచడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ వ్యహారంలో ప్రిటోరియా న్యూస్‌ ఎడిటర్‌  పెయిట్‌ ర్యామ్‌పెడి అత్యుత్సాహం ప్రదర్శించాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ప్రిటోరియా: టెంబిసా పట్టణంలో గోసియామె తమార సిత్‌హోల్‌ అనే 37 ఏళ్ల మహిళ.. నెలలు నిండకముందే పది మంది పిల్లలకు జన్మనిచ్చిందన్నది ప్రిటోరియా న్యూస్‌ కథనం. ఈ రికార్డు జననాల కథనం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా హౌజ్‌లన్నీ ఆ కథనాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే అధికారికంగా ఈ విషయాన్ని టెంబిసా అధికారులుగానీ, ఏ ఆస్పత్రి వర్గాలుగానీ ప్రకటించలేదు. ఇక వారం
గడుస్తున్నా ఆ తల్లీబిడ్డలు మీడియా ముందుకు రాకపోవడంతో ఇది అసలు ఉత్త కథే అని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. దీనికితోడు ఆమె స్వయంగా మీడియాకు వెల్లడించిన స్టేట్‌మెంట్‌ ప్రకారం చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. 

స్టీవ్‌ బికో అకాడమిక్‌ హస్పిటల్‌లో తాను పది మందికి జన్మనిచ్చానని సిత్హో‌ల్‌, ‘క్లెమెంట్‌ మన్యాతెల షో’లో ఆమె స్వయంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆ హాస్పిటల్‌ సీఈవో మథాబో మాథ్యుబెలా స్పందించారు. అసలు అలాంటి డెలివరీ కేసు తమ హాస్పిటల్‌ రికార్డుల్లో నమోదుకాలేదని ఆయన తేల్చేశారు. స్టీవ్‌ బికో ఆస్పత్రిపాటుతో పాటు ఇలాంటి సంక్లిష్టమైన ప్రసవాల కేసును డీల్‌ చేసే లూయిస్‌ పాస్టూర్‌, మెడిక్లినిక్‌ మెడ్‌ఫోరం హాస్పిటల్స్‌ కూడా అలాంటి డెలివరీ తమ దగ్గర రికార్డు కాలేదని వెల్లడించాయి. దీంతో ఈ వ్యవహారంలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆ బిడ్డల తండ్రి టెబెహో సోటెట్సి తాజా స్టేట్‌మెంట్‌తో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. 

ఎక్కడున్నారో తెలియదు
తాను చాలా పేదరికంలో ఉన్నానని, బిడ్డలకు సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని గోసియామె సిత్‌హోల్‌ ప్రజలను కోరింది. ఆమె విజ్ఞప్తి మేరకు దక్షిణాప్రికా దేశవ్యాప్తంగా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో విరాళాల్ని ఇవ్వొద్దంటూ ఇప్పుడు స్వయంగా టెబెహో కోరుతున్నాడు. అసలు పిల్లలెక్కడ ఉన్నారో? నాక్కుడా తెలియదు. వాళ్లు ఇంటికి వచ్చేదాకా ఎవరూవిరాళాలు ఇవ్వకండి అంటూ ఆమె భర్త సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ​ముందుగా ప్రిటోరియా న్యూస్‌కి సమాచారం అందించింది టెబెహోనే కావడం విశేషం. మరోవైపు సోటెట్సి కుటుంబ సభ్యులు  గోసియామో సిత్‌హోల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2018లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిందని ఆమె ప్రకటించుకుందని, ఆ బిడ్డలు మాత్రం జాడలేరని వాళ్లు మీడియాకు తెలిపారు. 

నన్ను బద్నాం చేయొద్దు
కాగా, పది మంది పిల్లల వ్యవహారంలో దక్షిణాఫ్రికా మీడియా నైతికతపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక పేద మహిళ జీవితంలోకి తొంగిచూసి.. అనుమానాలు, ఆరోపణలు చేయడం సరికాదని మీడియాను హెచ్చరించారు కొందరు. అయితే ఆ కొందరే ఇప్పుడు అనుమానాల నేపథ్యంలో ఫేక్‌ కథనాలతో ప్రజల్ని తప్పుబట్టారంటూ మీడియాపై విరుచుకుపడుతున్నారు. ఇక మంగళవారం ప్రిటోరియా న్యూస్‌ రూంలో ప్రత్యక్షమైన గోసియామో సిత్‌హోల్‌.. తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని, టెబెహో ఫ్యామిలీకి తన మీద మొదటి నుంచి ప్రేమ లేదని, అందుకే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బిడ్డల ఐడెంటిటీని పబ్లిక్‌గా ఎప్పుడు చూపిస్తారనే ప్రశ్నకు ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించడంతో అనుమానాలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top